ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరి-బేసి విధానం అమల్లో ఉన్న రోజుల్లో పొల్యూషన్ వివరాలను కేంద్ర కాలుష్యనియంత్రణ మండలి న్యాయస్థానానికి అందజేసింది. వివరాలను పరిశీలించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరి-బేసి విధానం అమలు వల్ల ఉపయోగం లేదని, ఆ విధానం అమల్లో ఉన్న రోజుల్లో కూడా గాలి కాలుష్యం తగ్గలేదని తెలిపింది. పంజాబ్, హరియాణా, యూపీ, దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నవంబరు 29న హాజరుకావాలని ఆదేశించింది. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో ఈ రాష్ట్రాలు వైఫల్యం చెందాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఇంకా డీజిల్, కిరోసిన్ వాహనాల వినియోగాన్ని ఎందుకు నివారించలేకపోతున్నారో చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.దీనికి అధికారులను ఎందుకు బాధ్యులను చేయకూడదని వ్యాఖ్యానించింది. ట్రక్కులు, ఆటోలు, ట్రాలీలపై నిషేధం ఉన్నా ఎందుకు తిరుగుతున్నాయని నిలదీసింది..ద్విచక్ర, మూడు చక్రాల వాహనాల కారణంగా వెలువడే కాలుష్యంపై ఏడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. గాలి నాణ్యత పెంచడానికి సరైన మార్గదర్శకాలను వారంలోగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు.

Recommended For You