వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చంద్రబాబు

vamsi

టీడీపీతో పాటు అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది అధిష్టానం. ఇవాళ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన అధినేత చంద్రబాబు.. సుధీర్ఘ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వంశీ వ్యవహారం ప్రధానంగా చర్చకు వచ్చింది. వంశీ ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని.. వైసీపీలోకి వెళ్లేందుకే పార్టీపై దుమ్మెత్తిపోశారని మెజార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. వంశీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు.. వంశీని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయించారు. మరోవైపు.. వంశీ పార్టీని వీడి వైసీపీలో చేరడం ఖాయం కావడంతో.. గన్నవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై కూడా టీడీపీలో చర్చ జరిగింది.

టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వంశీ.. కొన్ని రోజులకే మాట మార్చారు. జగన్‌‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అంతేకాదు, టీడీపీపైనా పార్టీ అధినేత చంద్రబాబుపైనా, లోకేష్‌పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా సమర్థంగా పోషించలేకపోతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ హైకమాండ్‌.. ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

మరోవైపు టీడీపీ ఎంపీలతోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. శీతాకాల సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న అప్రజాస్వామిక విధానాలకు కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు టీడీపీ ఎంపీలు. రివర్స్‌ టెండరింగ్‌, మీడియాపై ఆంక్షలు, ఇతర సమస్యలపై తమ పోరాటం కొనసాగుతందన్నారు. రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు టీడీపీ ఎంపీలు.

Recommended For You