మృత్యుంజయుడైన 19 రోజుల పసికందు

3 తరాలకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులను పొట్టన పెట్టుకున్న డెంగీని..19 రోజుల పసికందు జయించాడు. ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో.. గత 17 రోజులుగా మృత్యువుతో పోరాడిన సోనీ-రాజగట్టు దంపతుల రెండో కుమారుడి ప్రాణాలను వైద్యులు నిలిపారు. నెల రోజుల క్రితం మంచిర్యాలలో ఓ కుటుంబాన్ని డెంగీ మహమ్మారి ఛిన్నాభిన్నం చేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో దంపతులు సోనీ-రాజగట్టుతో పాటు వారి పాప శ్రీవర్ధిని కూడా ఉంది. అలాగే రాజగట్టు తాత లింగయ్య కూడా డెంగీకి బలయ్యాడు.

నిండు గర్భిణిగా ఉన్న సమయంలో సోనీకి డెంగీ వచ్చింది. ఆ మహమ్మారి కడుపులో ఉన్న చిన్నారికి కూడా సోకింది. పండంటి బాబుకు జన్మనిచ్చిన తర్వాత సోనీ చనిపోయింది. అప్పటి నుంచి డెంగీతో పోరాడిన ఆ చిన్నారిని.. వైద్యులు క్షేమంగా కాపాడటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.