అయోధ్యలో రామాలయ నిర్మాణం త్వరలోనే సాకారమవుతుంది – అమిత్ షా

ayodhya

అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం అయ్యిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. త్వరలోనే రామాలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. లేత్‌ హార్‌లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. అయోధ్య వ్యవహారం-రామాలయ నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి చుట్టూనే అమిత్ షా ప్రచారం కొనసాగింది. జార్ఖండ్‌ నుంచి నక్సలిజాన్ని నిర్మూలించడంలో ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ చేసిన కృషి అసామాన్యమైనదని అమిత్ షా కితాబిచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల వెలువరించిన కీలక తీర్పులను ప్రస్తావించిన షా, అయోధ్యలో రామాలయ నిర్మాణం త్వరలోనే సాకారమవుతుందన్నారు.

జార్ఖండ్ శాసనసభకు 5 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 30న తొలి దశలో 13 అసెంబ్లీ స్థానాలకు, డిసెంబర్ 7న రెండో దశలో 20 సీట్లకు, డిసెంబర్ 12న మూడో దశలో 17 స్థానాలకు , డిసెం బర్ 16న నాలుగో దశలో 15 సీట్లకు, డిసెంబర్ 20న ఐదో దశలో 16 స్థానాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 23న కౌంటింగ్ జరుగుతుంది. ఇక, ఈ ఎన్నికలను కమలదళం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మహారాష్ట్ర, హర్యానాల్లో అంచనాలకు అనుగుణంగా ఫలితాలు రాలేదని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. అందుకే అగ్రనాయకులందరినీ మోహరిస్తోంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలు రాష్ట్రవ్యాప్తంగా 50 ర్యాలీలు, బహిరంగసభల్లో పాల్గొననున్నారు.

Recommended For You