దీప్తిశ్రీ కథ విషాదాంతం.. మృతదేహాన్ని గుర్తించిన ధర్మాడి సత్యం టీం

దీప్తిశ్రీ కథ విషాదాంతం.. మృతదేహాన్ని గుర్తించిన ధర్మాడి సత్యం టీం

ttt

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కనిపించకుండా పోయిన దీప్తిశ్రీ కథ విషాదాంతమయ్యింది. మూడు రోజుల తర్వాత చిన్నారి దీప్తిశ్రీ.. విగతజీవిగా మూటలో కనిపించింది. ఉప్పుటేరులో గాలింపు చేపట్టిన ధర్మాడి సత్యం టీం.. దీప్తిశ్రీ మృతదేహాన్ని గుర్తించింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

కాకినాడ పగడాల పేటకు చెందిన సత్య శ్యామ్‌కుమార్‌, సత్యవేణిలకు గతంలో పెళ్లికాగా.. వీరిద్దరి సంతానం దీప్తి శ్రీ. అయితే రెండేళ్ల క్రితం సత్యవేణి అనారోగ్యంతో చనిపోయింది. దీంతో శ్యామ్‌కుమార్‌.. శాంతి కుమారి అనే మహిళను రెండోపెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి 13 నెలల బాబు ఉన్నాడు. దీప్తిశ్రీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. అయితే మూడు రోజుల క్రితం దీప్తిశ్రీ కనిపించకుండా పోయింది. దీంతో తండ్రి సత్యశ్యామ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ కిడ్నాప్‌ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. దీప్తిశ్రీ కనిపించకుండా పోయిన స్కూల్ సమీపంలోని సీసీ కెమెరాల్లో పరిశీలించారు. ఈ సీసీటీవీల్లో మొహానికి ముసుగు కట్టుకొని చిన్నారిని తీసుకెళ్తున్నమహిళ కనిపించింది. ఇటు భర్త సైతం తన భార్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో ఆమె చేసిన తప్పును ఒప్పుకుంది. తానే దీప్తీశ్రీని చంపినట్లు చెప్పింది. పాపను స్కూల్ నుంచి నేరుగా ఇంటికి తీసుకెళ్లి.. మెడకు టవల్ బిగించి హత్య చేసినట్లు తెలిపింది. దీప్తీశ్రీ చనిపోవడంతో.. డెడ్‌బాడీని గోనె సంచిలో కట్టేసి సంజయ్‌నగర్‌ నుంచి షేర్‌ఆటోలో ఇంద్రపాలెం బ్రిడ్జి వద్దకు వచ్చి ఉప్పుటేరులో పడేసినట్లు చెప్పింది.

శాంతికుమారి చెప్పిన ఉప్పుటేరులో డెడ్‌బాడీని వెతికేందుకు పోలీసులు.. ధర్మాడి సత్యం టీమ్ సాయం కోరారు. 15మంది టీమ్‌ ఆదివారం నుంచి ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. చివరి సోమవారం మధ్యాహ్నం మృతదేహాన్ని బయటకు తీశారు. చిన్నారి దీప్తిశ్రీ ఇక లేదన్న బాధతో తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. స్కూల్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన పాప.. ఇలా చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story