నవంబర్ 27.. వీరనారి రాణీ రుద్రమదేవి వర్థంతి

నవంబర్ 27.. వీరనారి రాణీ రుద్రమదేవి వర్థంతి

rani

తెలంగాణలో కాకతీయుల పాలనను స్వర్ణయుగంగా చెబుతారు. కాకతీయుల కీర్తి ప్రతిష్టను నలుదిక్కులా విస్తరించిన ఘనత కచ్చితంగా రాణీ రుద్రమదేవికే దక్కుతుంది. రుద్రమ పాలన, ప్రజా సంక్షేమం వంటివి నేటి ప్రభుత్వాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. అలాంటి వీరనారి రుద్రమదేవి వర్థంతి నేడు. నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం, చందుపట్ల గ్రామంలో సరిగ్గా 730 ఏళ్ల క్రితం రుద్రమదేవి వీరమరణం పొందినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. శత్రువుల గుండెల్లో గుర్రాలు పరుగుపెట్టించిన ధీరవనిత రుద్రమదేవి చరిత్రను చందుపట్ల గ్రామం తనలో దాచుకుంది. ఓరుగల్లు నుంచి గుర్రంపై పానగల్లు వెళ్తుండగా.. ఇదే ప్రాంతంలో వీరమరణం పొందినట్టు చెప్పే శిలాశాసనం ఇక్కడే లభ్యమైంది.

చందుపట్ల గ్రామానికి చెందిన సైదులు.. ఇక్కడ లభించిన శాసనంపై PHD చేశారు. ఇందులో భాగంగా గ్రామ శివారులోని పాడుబడ్డ ప్రాచీన దేవాలయాలను పరిశీలించారు. ముత్యాలమ్మ గుడి ఎదుట కిందపడి ఉన్న రాతిస్తంభం సైదుల్ని విశేషంగా ఆకర్షించింది. ఈ విషయాన్ని పురావస్తుశాఖ ద్వారా.. రాణి రుద్రమదేవి వీరమరణం చెందిన వివరాల శిలాశాసనంగా గుర్తించారు. కంపచెట్ల పొదల్లో ఉన్న ఈ శిలాశాసనాన్ని.. స్థానిక యువత వెలికితీసి దేవాలయం ముందు పునఃప్రతిష్టించారు.

క్రీస్తు శకం 1150 నుంచి 1323 వరకు హన్మకొండను రాజధానిగా చేసుకుని కాకతీయులు పాలన కొనసాగించారు. గణపతిదేవుడి వారసురాలుగా.. రాణీ రుద్రమదేవి సాహసోపేత నిర్ణయాలతో పారిపాలన సాగించినట్టు పలువురు విదేశీ చరిత్రకారులు తమ రచనల ద్వారా తెలిపారు. హన్మకొండ నుంచి ప్రస్తుత నల్గొండ జిల్లా పానగల్‌ వరకు కాకతీయులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. పానగల్లులోని సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయాలకు రాకపోకలు సాగించేవారు. ఈ క్రమంలోనే రాణీ రుద్రమదేవి పానగల్లుకు వస్తుండగా.. కాయస్థ అంబదేవుని చేతిలో వీరమరణం పొందినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.

రుద్రమ సేవకుడైన పువ్వల ముమ్మడి అనే వ్యక్తి.. ఆ వీరనారి మరణ వివరాలకు సంబంధించిన శిలాశాసనం చెక్కించినట్టు తెలుస్తోంది. వీటి ద్వారానే 1289 సంవత్సరంలో నవంబర్‌ 27న వీరమరణం పొందినట్టు సమాచారం. ప్రతి ఏటా రుద్రమ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, చందుపట్ల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

నాలుగేళ్ల క్రితం CM KCR మిషన్‌ కాకతీయ పథకాన్ని చందుపట్ల గ్రామం నుంచే ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని రాణీ రుద్రమదేవి చరిత్రను భావి తరాలకు తెలిసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్‌. ఇప్పటికైనా.. చందుపట్ల చరిత్రను ప్రపంచానికి తెలిసే చేయాలని కోరుతున్నారు స్థానిక యువత.

Tags

Read MoreRead Less
Next Story