టీడీపీ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని అమలుచేసేలా ఒత్తిడి

rounda-table

ఏపీలో నెలకొన్న ఇసుక సమస్యపై విపక్షాలు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. విజయవాడలో టీడీపీ ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జనసేనతో పాటు, సీపీఐ, సీపీఎం, ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు సంఘీబావం తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, భవన నిర్మాణ దారులు, కార్మిక సంఘాలు ఇందులో పాల్గొన్నారు. 7అంశాలపై సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఐదు నెలల్లో ఉపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న 36 మంది భవన కార్మికులకు సంతాపం తెలుపుతూ తీర్మానం చేశారు. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను సీజ్‌ చేసి, కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. అక్రమ రవాణా అరికట్టి టీడీపీ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టేలా సర్కారుపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. 6 టైర్ల టిప్పర్లకు ఒక క్వార్టర్‌ రోడ్‌ ట్యాక్స్‌ రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13వ తేదీ నాటికి అమలు చేయాలని అల్టిమేటం ఇచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా అందించిన ఇసుక సరఫరాను అర్ధాంతరంగా ఆపేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకొచ్చిందని సీపీఐ నిలదీసింది. గతంలో 7 నుంచి 8 వేలు పలికిన ఇసుక లారీ ధర ఇప్పుడు 50 వేల పలకుతోందని ఆ పార్టీ నేతలు దుయ్యబట్టారు. సిమెంటు కంపెనీలతో బేరాలు కుదరక ఇసుకను ప్రభుత్వం నిలిపేసిందని ఆరోపించారు. 36 మంది కార్మికుల ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వ అవినీతే కారణమని.. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం చేసిన రాజకీయ హత్యలేనని ఆక్షేపించారు.

ప్రభుత్వం నవరత్నాల చుట్టూ తిరుగుతోందే తప్ప రాష్ట్ర భవిష్యత్తును పట్టించుకోవడంలేదని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. మద్యం పాలసీని ఒక్క రోజుకూడా ఆలస్యం లేకుండా అమలు చేసిన సర్కారు…, ఇసుక పాలసీ అమలుకు మాత్రం ఎందుకు 5 నెలల సమయం తీసుకుందని ప్రశ్నించారు.

ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం సీనియర్ నేతలు విమర్శించారు. ఐక్య కార్యాచరణతో అన్ని సమస్యలపైనా దశలవారీగా ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు.