మళ్లీ వాయిదా పడ్డ ఆర్టీసీ ప్రైవేటీకరణ విచారణ

మళ్లీ వాయిదా పడ్డ ఆర్టీసీ ప్రైవేటీకరణ విచారణ

hi

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణ మరోసారి వాయిదా పడింది. స్టేను పొడిగించొద్దన్న ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. అటు ప్రైవేటీకరణ వెనుక దురుద్దేశాలు ఉన్నాయంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

5 వేల 100 రూట్లను ప్రైవేటీకరిస్తూ.. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో బుధవారం కూడా వాదనలు కొనసాగాయి. ఈ అంశంలో తదుపరి చర్యలు చేపట్టవద్దని, మధ్యంతర ఉత్తర్వులను కూడా పొడిగించవద్దని కోరింది ప్రభుత్వం. ఏజీ అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది. కేబినెట్ నిర్ణయంపై జీవో ఇచ్చే వరకు న్యాయ సమీక్ష చేయరాదని ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు.

3 రోజుల లోపు ఉద్యోగంలో చేరకపోతే 5100 రూట్లను ప్రైవేటీకరిస్తామనడంలో దురుద్దేశం ఉందన్నారు పిటిషనర్‌ తరపు న్యాయవాది. నీరు, గాలి, సముద్రం, అడవుల్లాగే రవాణా వ్యవస్థ కూడా సహజ వనరని చెప్పారు. సహజవనరులను ప్రైవేటీకరణ చేయొద్దని గతంలో.. సుప్రీంకోర్టు చెప్పిందన్నారు పిటిషనర్‌. అయితే సహజ వనరు అంటే నిర్వచనం చెప్పాలని అడిగిన సీజే.. రోడ్డు సహజ సంపద కాదని స్పష్టం చేసింది.

అటు మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా ప్రైవేటీకరణపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ప్రపంచం గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ కాలంలో ఉందని అభిప్రాయపడింది. ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయం చట్టబద్ధమా? చట్ట విరుద్ధమా? అనేదే న్యాయస్థానం ముందున్న అంశమని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు ఏం చెబుతుందనేది ఆసక్తిగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story