రాష్ట్రం నుంచి ఇన్వెస్టర్స్ వెనక్కు వెళ్లిపోతున్నారు: చంద్రబాబు

chandrababu

వైసీపీ సర్కార్‌ ఆరు నెలల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తన పాలనలో పెట్టుబడిదారులను తీసుకొచ్చి అభివృద్ధికి శ్రీకారం చుడితే.. జగన్‌ పాలనలో ఇన్వెస్టర్లు పారిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మూడు రోజుల కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా తొలిరోజు టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు చంద్రబాబు.

పార్టీ బలోపేతం, కార్యకర్తలకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన కొనసాగుతోంది. తీరిక లేకుండా జిల్లాలను చుట్టేస్తూ క్యాడర్‌కు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కర్నూలుకు చేరుకున్న చంద్రబాబు.. వైసీపీ బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఆ తరువాత నగర శివారులోని వీజీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో నియోజకవర్గాలవారిగా సమీక్షలు చేశారు.

సీఎం జగన్‌ తీరుపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. ముఖ్యమంత్రి ప్రవర్తనతో అభివృద్ధి అంతా వెనక్కు వెళిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావడం లేదని.. ఉన్న ఇన్వెస్టర్స్‌ కూడా వెనక్కు వెళ్లిపోతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు చంద్రబాబు. తాము అధికారంలో ఉన్నపుడు ఉచితంగా ఇసుకను అందిస్తే.. ఇప్పుడు వైసీపీ సర్కారు లారీ ఇసుక ధరను మూడు రెట్లు పెంచిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీ ప్రజలకు భారంగా మారిందన్నారు.

ప్రజావేదిక కూల్చివేతతోనే వైసీపీ అరాచకం మొదలైందన్నారు టీడీపీ అధినేత. టీడీపీ కార్యకర్తలపై ఇప్పటివరకు 690 దాడులు జరిగాయని గుర్తు చేసిన చంద్రబాబు.. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

హైదరాబాద్‌లో దిశ హత్యోదంతంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిశపై అత్యాచారం చేసి.. హత్య చేసిన వారికి భూమిపై బతికే హక్కు లేదన్నారు. ఆ మృగాలకు ఉరి వేయడమే సరైందని అభిప్రాయపడ్డారు.

అంతకు ముందు కర్నూలుకు చేరుకున్న చంద్రబాబుకు జిల్లా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్‌ నియోజకవర్గాల కార్యకర్తలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. మంగళవారం ఆలూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, కొడుమూరు, పత్తికొండ, నంద్యాల నియోజవకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

Recommended For You