ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్

cm

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులే లక్ష్యంగా కేసీఆర్‌ హస్తిన పర్యటన కొనసాగనుంది.

సుధీర్ఘ విరామం తరువాత మరోసారి ఢిల్లీ వెళ్లారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న ముఖ్యమంత్రి.. ప్రధాని మోదీతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. సీఎంవో కార్యాలయం కూడా దీన్ని ధృవీకరించింది. ముఖ్యంగా ఐఐఎంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధాని మోదీతో కేసీఆర్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ప్రధానితో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీతోనూ కేసీఆర్‌ సమావేశం కానున్నారు. రక్షణ శాఖ భూముల కేటాయింపు వంటి కీలక అంశాలతో పాటు ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రులతో సీఎం కేసీఆర్‌ చర్చిస్తారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పథకాలు వారికి వివరించనున్నారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్ శర్మ ఇంట్లో జరగనున్న వివాహ వేడుకకు సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. రెండు రోజులు అక్కడే బస చేయనున్నారు. ముందుగా రాజీవ్‌శర్మ ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకే సీఎం ఢిల్లీ వెళ్తున్నారని ప్రచారం జరిగినా.. రాష్ట్ర అంశాలే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story