విభజన సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో కేసీఆర్ ప్రయత్నాలు

kcr

సీఎం కేసీఆర్‌.. ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ మంగళవారం ఉదయం హస్తిన వెళ్లిన ఆయన.. తెలుగురాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి యత్నిస్తున్నారు. వీటిపై చర్చించేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు సీఎం కేసీఆర్‌. పూర్తి నివేదికలతో సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. దీంతో.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలని పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు.

అయితే.. రెండు రాష్ట్రాల మధ్య ఆప్మెల్‌ విభజన పీఠముడిగా మారింది. ఈ సంస్థ విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉంది. ఆప్మెల్‌ కూడా 58:42 నిష్పత్తిలోనే విభజించాలని కోరుతోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. అయితే.. ఆప్మేల్‌ వాస్తవ యజమాని సింగరేణి కావడం, ఆప్మెల్‌లో 85 శాతానికి పైగా పెట్టుబడులు సింగరేణి సంస్థవే కావడంతో.. సింగరేణి ఆస్తుల్లో ఏపీ వాట అడగటం న్యాయం కాదంటోంది తెలంగాణ ప్రభుత్వం.

ఇక 9వ షెడ్యూల్లోని మరో సంస్థ ఏపీఎస్‌ఎస్సీ విభజన సైతం పీఠముడిగా మారింది. అటు విభజన చట్టం ప్రకారం.. ఇప్పటికీ గిరిజన యూనివర్శిటీ పెండింగ్‌లో ఉంది. దీంతో పాటు 9వ షెడ్యూల్లోని 91 సంస్థల వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే షీలాభిడే కమిటీ సిఫార్సులు చేసినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనిపై అసంతృప్తితో ఉంది. అయితే.. అటు ఏపీ ప్రభుత్వం మాత్రం షీలాభిడే కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఇప్పటికీ జీవోలు జారీ చేసింది. ఇలాంటి సమస్యల్నింటిపైనా.. ప్రధాని మోడీతో చర్చించాలని భావిస్తున్నారు సీఎం కేసీఆర్‌.

Recommended For You