అమ్మా! నేనిక్కడ క్షేమం కాదు..

అమ్మా! నేనిక్కడ క్షేమం కాదు..

disha

ఓ ఆడపడుచు ఆక్రందన అరణ్య రోదనే అయ్యింది

ఆమె నోరు లేని మూగ జీవాలకు డాక్టర్

నోరున్న మానవ మృగాల కామదాహానికి బలైపోయింది

రోజూ మనుషులు తిరిగే ఆ దారిలో

ఆరోజెందుకో ఆ దారిలో దెయ్యాలు తిరుగుతున్నట్లనిపించింది ఆమెకు..

మృగాళ్ల చూపులు ముళ్లులా గుచ్చుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది

భయమైతుందని భయం భయంగానే చెప్పింది తోబుట్టువుతో..

భయపడినంతా అయింది..

నాలుగు గోడల మధ్య ఉన్న చెల్లెలికి.. అక్క నలుగురు నరరూపరాక్షసుల మధ్య ఉన్నదని తెలియదు

కనిపెంచిన తల్లిదండ్రులు కూడా కనికరించలేని పని చేశారు

మద్యం మత్తులో మానవత్వాన్ని మరిచారు.. మృగాళ్లలా ప్రవర్తించారు..

వేటగాడి వలలో చిక్కిన లేడిపిల్లలా విలవిలలాడింది..

అంతలోనే గొంతు మూగబోయింది.. అమాయకపు ప్రాణం గాలిలో కలిసి పోయింది..

చట్టం.. చట్టం.. చట్టం.. ఏం చెబుతున్నాయి చట్టాలు..

బలమైన సాక్ష్యాధారాలు చూపందే దోషులు శిక్షార్హులు కాదంటున్నాయి

మరి ఈ ఘటనకు ఎవరొచ్చి సాక్ష్యం చెప్పాలి.. ఎవరొచ్చి చెబితే వారిని శిక్షిస్తారు..

ఆ మానవ మృగాలను కాకులు, గ్రద్ధలు కూడా ముట్టవేమో

ఇలాంటి వారికి ఎలాంటి శిక్షలు విధిస్తే ఆడపడుచుల ఆవేదన చల్లారుతుంది

సంవత్సరాల తరబడి సాగదీసే చట్టాలు మారాలి

నొప్పి వచ్చినప్పుడు మందేస్తేనే బాధ తగ్గుతుంది

తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడితేనే మరొకడు భయపడతాడు

మృగాడు మారతాడనుకోవడం ఒట్టిమాట.. కౌన్సిలింగులతో కాలక్షేపం

జైల్లో కూర్చోబెట్టి మూడు పూటలా మేపడం సమంజసమా..

రోజూ పేపర్లో, టీవీలో ఎన్నో అన్యాయాలు, మరెన్నో అరాచకాలకు అక్షర, దృశ్య రూపాలు..

కానీ శిక్షలు పడేది ఎందరికి

దర్జాగా ఆ మానవ మృగం మనుషుల మధ్యలోకి మళ్లీ..

మొన్న నిర్భయ, నిన్న మానస, నేడు దిశ..

ఇలా ఆడపడుచుల బ్రతుకు అడవి మ‌ృగాల బారిన పడి బలైపోవలసిందేనా..

మద్యం ఏరులై పారుతుంటే మగువకు రక్షణ ఎక్కడ..

చట్టాలు చాలా మారాలి..

మహిళల మీద చెయ్యి వేయడానిక్కూడా భయపడే రోజు రావాలి..

మరో దీపం ఆరిపోకముందే అది సాధ్యమా..!!

Read MoreRead Less
Next Story