ఓ మగాడా.. ఒక్క మాట..

girl

ఓ మగాడా.. ఒక్క నిమిషం.. నా మాట ఆలకించవా..! నా కంటి నుంచి రాలుతున్న నీటిబొట్లు వలన అనుకుంటా.. లోకమంతా మసకబారినట్లు కనిపిస్తుంది. నా కళ్లు మూత పడటం లేదు. ప్రశాంతంగా నిద్రపోదామన్నా కన్నీటిధారలు నా కనురెప్పలకు అడ్డు వస్తున్నాయి. అందుకే నా కోసం ఒక్కసారి నీ కళ్లు మూసుకుని.. మనసులో మీ అమ్మని తలుచుకుని.. నా ఆక్రందన, ఆవేదన విను. నాలాగే.. మీ ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లి, ఏదోక రూపంలో ఓ స్త్రీ మూర్తి ఉన్నారు కదా! అలాగే ప్రతి ఇంట్లో ఉన్నారు కదా!

అమ్మ ఒడిలో ఎంతో ఆనందంగా ఆడుకుంటున్న నేను.. ఇప్పుడేంటి ఇలా అయిపోయాను. ఇప్పుడే కదా.. అన్నం వద్దని మారాం చేస్తున్న నాకు మా అమ్మ చందమామ కథ చెప్పి గోరు ముద్దులు తినిపించింది. జోలపాడింది. మరి చుట్టూ ఈ చీకటి ఏంటీ? నాకు చాలా భయంగా ఉంది. అతను ఎవరు? నా మీదకు ఎందుకు అలా వస్తున్నాడు? నాకు వణుకు వస్తుంది. నోట్లో నుంచి మాటలు రావడం లేదు. నేను నీ చెల్లిలాంటి దానిని నాపై ఎందుకు ఇలా రాక్షసత్వం చూపిస్తున్నావన్నా వదలలేదు. అమ్మ , నాన్న నన్ను ఎందుకు కన్నారు? ఈ నరకయాతన తట్టుకోవడం నా వల్ల కాదు.. దేవుడా నన్ను త్వరగా నీ దగ్గరకు తీసుకెళ్లిపో.. మరో జన్మంటూ ఉంటే ఈ సమాజంలో నన్ను ఆడపిల్లలా పుట్టనివ్వకు.

నాలాగే ఎందరో అక్కలపై, అమ్మలపై జరుగుతున్న అఘాయిత్యాలు నాకు మరణమృదంగంలా వినిపిసున్నాయి. నాలాగే అభం, శుభం తెలియని నా ఫ్రెండ్స్.. లోకం పోకడ తెలియని నా అక్కలు, మదమెక్కిన మానవమృగాల చేతిలో బలైపోతున్నారు. మృగాళ్ల కామదాహానికి కర్పూరంలా కరిగిపోతున్న.. ఓ కథువా, ఉన్నావ్, ఓ దాచేపల్లి, నిర్భయ, ఓ దిశ.. ఇలా కొన్ని వేల హత్యాచారాలు జరుగుతున్నాయి.. దేవుడా నీవు అందరిలో మార్పు తెస్తావట కదా.. మరి వావివరసలు మరిచిపోయి నరరూపరాక్షసుల్లా వ్యవహరించే ఈ మగాడిలో ఎందుకు మార్పు తీసుకురావు..? వాళ్లలో మేము నాన్నను, అన్నను చూసుకుంటున్నాము. మరి వాళ్లు మాలో.. తల్లినో, అక్కనో, చెల్లినో, బుడి బుడి అడుగులు వేసే బుజ్జిపాపనో ఎందుకు చూడలేకపోతున్నారు..! స్వామి కొంచెం నీవు అయినా వారికి చెప్పి.. మేము కూడా ఈ సమాజంలో బ్రతకే ధైర్యాన్ని ఇవ్వు.


సోదరి

Recommended For You