జగన్ పద్ధతి మార్చుకోకపోతే.. ప్రజలే తిరగబడతారు: చంద్రబాబు

జగన్ పద్ధతి మార్చుకోకపోతే.. ప్రజలే తిరగబడతారు: చంద్రబాబు

chandrababuరాష్ట్రంలో ఈ ఆరునెలల్లో అరాచక పాలన చూశామని.. భవిష్యత్ అంతా మనదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన రెండోరోజు పలు నియోజకకవర్గాల నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వైసీపీ బాధితులతో చంద్రబాబు మాట్లాడారు.

టీడీపీ శ్రేణులకు అధినేత చంద్రబాబు ధైర్యం నూరిపోస్తున్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ జిల్లాలో టీడీపీ బలోపేతానికి వ్యూహాలు రచిస్తున్నారు.. తొలిరోజు ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్‌ నియోజకవర్గాల కార్యకర్తలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. రెండోరోజు ఆలూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, కొడుమూరు, పత్తికొండ, నంద్యాల నియోజవకవర్గ నేతలు, కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.

ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. అభివృద్ధి మొత్తం స్తంభించిపోయిందని, అమరావతి నిర్మాణం ఆగిపోయిందని, విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లాయని ఆరోపించారు. రాష్ట్రానికి చేయూతనిచ్చే ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కు వెళ్లాయని చంద్రబాబు గుర్తు చేశారు.

ఇక జిల్లాలో 36 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈదాడులకు ఎవరూ బయపడవద్దని.. అందరికీ అండగా ఉంటామని కేడర్‌లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. దాడులు కొనసాగిస్తే తిరగబడతామన్నారు. పదవులు శాశ్వతం కాదని, వైసీపీకి సపోర్ట్‌ చేస్తున్న పోలీసులు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

అంతకు ముందు వైసీపీ బాధితులతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన వైసీపీ బాధితులు తమ ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వారు పడుతున్న కష్టాలను తెలుసుకున్న చంద్రబాబు.. ముఖ్యమంత్రి పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే తిరగబడతారంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story