అమిత్‌షా అంటే వైసీపీ వాళ్లకు భయం.. నాకు గౌరవం : పవన్ కళ్యాణ్

pawan-kalyan

తిరుపతిలో కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాల జనసేన నాయకులతో పవన్ సమావేశం నిర్వహించారు. రైతు సమస్యలు, నిత్యావసరాల ధరల పెంపు, రాయలసీమ వెనకబాటుతనం, తెలుగు వైభవం, హిందూ ధర్మ పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. బీజేపీకి తాను ఎప్పుడూ దూరంగా లేనన్నారు పవన్ కల్యాణ్.

ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీతో విభేదించిన కారణంగానే మొన్నటి ఎన్నికల్లో  ఒంటరిగా పోటీ చేశామని గుర్తు చేశారు. అమిత్‌షా అంటే వైసీపీ వాళ్లకే భయమని.. తనకు గౌరవం ఉందని అన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్లే తనతో సంప్రదింపులు జరిపారని ఆరోపించారు..

మత మార్పిడుల అంశంపైనా పవన్ తీవ్రంగా స్పందించారు. జగన్ ఇంటి సమీపంలోనే 40 మందికి మతం మారిస్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ధర్మ పరిరక్షణ కోసం తాను ఎంత వరకైనా వెళ్తానన్నారు.

పారిశ్రామిక అభివృద్ధిని ప్రభుత్వమే అడ్డుకుంటోందని జనసేనాని విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు సీఈవోలను బెదిరిస్తే పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు..

ఇంగ్లిష్‌ మీడియంపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు పవన్.. ఆంగ్ల మాధ్యమం అవసరమేనని..అయితే ఏ మీడియంలో చదవాలో ఎంచుకునే అవకాశం తల్లిదండ్రులు, పిల్లలకు ఉండాలన్నారు..

అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న మొక్కులు చెల్లించుకున్నారు పవన్. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందన్నారు ‌‌. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామిని ప్రార్ధించినట్లు చెప్పారు. మూడు దశాబ్ధాల క్రితం తిరుపతిలో తాను యోగా అభ్యసం నేర్చుకున్నట్లు గుర్తు చేసుకున్నారు పవన్.

Recommended For You