దిశ బిల్లుకు శాసనసభ ఆమోదం

దిశ బిల్లుకు శాసనసభ ఆమోదం

disha-bill

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. అత్యాచారానికి పాల్పడినట్లు ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి.. వెంటనే మరణ శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చామని సీఎం జగన్ ఆన్నారు. అటు టీడీపీ కూడా ఈ చట్టాన్ని స్వాగతించింది. మరోవైపు మార్షల్స్, టీడీపీ నేతల వివాదంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజున దిశా చట్టం, మార్షల్స్ - టీడీపీ నేతల వివాదంపై ప్రివిలేజ్ మోషన్ తో దద్దరిల్లిపోయాయి. దిశ ఘటనతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. లైంగిక దాడులను నిరోధించేందుకు దిశ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక దాడులను అరికట్టడమే ఈ చట్టం లక్ష్యం. సుదీర్ఘ చర్చ అనంతరం దిశ చట్టాన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

బాధితులకు సత్వర న్యాయం చేసేందుకే దిశ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు ఏపీ సీఎం జగన్‌. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని.. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు. నిందితులకు 21 రోజుల్లోనే మరణశిక్ష విధించేలా దిశ చట్టాన్ని రూపొందించామని వివరించారు.

దిశ చట్టాన్ని స్వాగతిస్తున్నామన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. అయితే చట్టాలు తీసుకొస్తేనే సరిపోదని.. వాటిని సరిగ్గా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంత గొప్పవారైనా తప్పు చేస్తే శిక్షించేలా ఉండాలన్నారు చంద్రబాబు.

అంతకుముందు సభ ప్రారంభం కాగానే.. మార్షల్ష్, టీడీపీ నేతలకు మధ్య జరిగిన వివాదంపై సభలో రచ్చ రాజేసింది. గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనలో మార్షల్స్‌తో ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్‌ దురుసుగా ప్రవర్తించారంటూ వైసీపీ ఆరోపణలు గుప్పించింది. దీనికి సంబంధించిన వీడియోను సభలో ప్రదర్శించిన అధికార పార్టీ సభ్యులు.. ప్రతిపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో దుమారం చెలరేగింది.

టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ అధికారిని బాస్టర్డ్ అని దూషించారని.. ఇది ప్రభుత్వ ఉద్యోగులను అవమానించటమేనని ఆరోపించారు. దీని పైన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని.. లేకుంటే ఆయనపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఎమ్మెల్సీ లోకేష్‌ మార్షల్స్‌ గొంతు పట్టుకోవడమేంటని ప్రశ్నించారు సీఎం జగన్‌.

వైసీపీ ఆరోపణలపై చంద్రబాబు వివరణ ఇచ్చారు. తాను నో క్వశ్చన్ అన్నానని.. బాస్టర్డ్ అనే పదం వాడలేదన్నారు. జగన్‌ ఉన్మాది అనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వం ఈ అంశం మీద తీర్మానం ప్రతిపాదించింది. అసెంబ్లీ మార్షల్స్ మీద అమర్యాదగా వ్యవహరించిన వారి పైన చర్యలు తీసుకొనే అధికారం స్పీకర్‌కు అప్పగిస్తూ మంత్రి బుగ్గన సభలో తీర్మానం ప్రతిపాదించగా.. వైసీపీ సభ్యులు ఆమోదించారు.

చంద్రబాబు మాటల్లో అన్‌పార్లమెంటరీ పదాలు ఉన్నాయి అని స్పీకర్‌ అభిప్రాయపడ్డారు. టీడీపీ సభ్యులు క్షమాపణ చెబితే బాగుటుందన్నారు. అసెంబ్లీ గేటు దగ్గరకు వచ్చిన మార్షల్స్‌తో గొడవ పడిన వారిలో బయట వ్యక్తులుంటే వారిపై క్రిమినర్‌ చర్యలకు స్పీకర్‌ ఆదేశించారు.

అయితే.. సభలో తనను అడుగడుగునా అవమానిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ సైతం బుద్ధి ఉందా.. సిగ్గు ఉందా అనడం ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలు అన్నట్లుగా చిత్రీకరించినందుకు ముఖ్యమంత్రిపై ప్రివిలేజ్‌ మోషన్‌ ఇచ్చారు టీడీపీ సభ్యులు. మూడు గంటలపాటు తాను అనని దాన్ని అన్నట్లు చిత్రీకరించారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం దగ్గరుండి సభను పక్కదారి పట్టించినందుకు సీఎంపై ప్రివిలేజ్‌ మోషన్‌ ఇచ్చినట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story