11 రోజులైంది.. ఒక్క క్లూ కూడా లేదు.. పోలీస్ పనితనానికే అగ్ని పరీక్ష

11 రోజులైంది.. ఒక్క క్లూ కూడా లేదు.. పోలీస్ పనితనానికే అగ్ని పరీక్ష

poluce

గిరిజన మహిళ మిస్సింగ్ కేసు కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పోలీసులకు సవాలుగా మారుతుంది. తిర్యాణి మండలంలో నమోదైన అదృశ్యం కేసు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎటు వెళ్లిందో తెలియదు.. అసలు ఉందో లేదో అనే అనుమానాలు. ఎవరైనా ఆఘాయిత్యానికి పాల్పడి మృతదేహాన్ని కపిపించకుండా చేసేశారా? పంగిడిమాదర గ్రామంలో ఇలాంటి అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి.

తిర్యాణి మండలం పంగిడిమాదర గ్రామానికి చెందిన జుగ్నకా రంభదేవి ఈనెల 16న తమ్ముడితో కలిసి ఇంటి నుంచి అసిఫాబాద్ కు స్కూటీ పై వచ్చింది. తిరిగి ఘాట్ రోడ్డు మీదగా ఖైరుగుడాకు చేరుకున్నారు. అయితే..తనకు గిన్నెదరి గ్రామంలో పని ఉందని చెప్పి తమ్ముడిని పంపించి రంభాదేవి ఒంటరిగానే బయలుదేరింది. అప్పట్నుంచి ఆమె ఆచూకీ చిక్కటం లేదు. ఫోన్ కూడా స్విచాఫ్ కావటంతో ఆమె కుటుంబసభ్యులకు తిర్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దిశ కేసు నేపథ్యంలో మహిళ మిస్సింగ్ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెల్ సిగ్నల్ ఆధారంగా క్లూ దొరుకుందేమోనని ప్రయత్నించారు. ఆమె సెల్ లోకేషన్ చివరిగా అసిఫాబాద్ ప్రాంతాన్ని చూపిస్తోంది. అయితే..రంభాదేవి కనిపించకుండా పోయిన రోజు పంగిడిమాదర గ్రామ సమీపంలో సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆమె స్కూటీ కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ మరుసటి రోజే స్కూటీ కనిపించకుండా పోయిందని అంటున్నారు. అంతకుమించి క్లూస్ దొరకని ఈ కేసులో మిస్టరీ చేధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. సమీప చెరువుల్లో గజ ఈతగాళ్లతో వెతికించారు. కొండలు, గుట్టల్లో తనిఖీ చేశారు.

రంభాదేవి గతంలో గుప్త నిధుల వేట, గంజాయి సరఫరాతో పాటు భూమి పట్టాలు ఇప్పిస్తామని పలువురు రైతుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అంతే కాక మావోయిస్టు సానుభూతిపరురాలిగా గతంలో పని చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో రంభాదేవి మిస్సింగ్ అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యమ ఆసక్తితో దళంలో చేరిందా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ట్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు తీసుకుపోయారా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story