తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం.. ఇక ఎన్నారై అల్లుళ్లకు మోత మోగినట్టే

తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం.. ఇక ఎన్నారై అల్లుళ్లకు మోత మోగినట్టే

NRI

ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా తనకూతురు అత్తారింట్లో సుఖంగా ఉండాలనే కోరుకుంటారు. వారి వారి స్థాయికి తగ్గట్టు ఆర్ధికంగా మంచి స్థితిలో ఉన్నవారికి ఇచ్చి వివాహం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక విదేశీ సంబంధం అంటే ఇక చెప్పనక్కరలేదు. ఆస్థిపాస్తులు అన్ని అమ్మి అయినా సరే అడిగినంత కట్నకానులు ఇచ్చి పెళ్లిచేస్తుంటారు. ఇదంతా బాగానే ఉంది. కానీ విదేశాల్లోని కొందరు అల్లుళ్లు అదనపు కట్నం కోసం భార్యలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. చట్టాల్లోని లొసగులను ఆసరాగా చేసికొని రెచ్చిపోతున్నారు. కారణం ఆయా దేశాల్లో అవి నేరాల జాబితాలో లేకపోవడమే.

ఇలాంటి విదేశీ అల్లుళ్ల ఆటకట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తచట్టాన్ని తీసుకొచ్చింది. మహిళా భద్రతా విభాగంలో ఎన్ ఆర్ ఐ మహిళా భద్రతా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. భార్యలను వేధింపులకు గురిచేసేవారి వివరాలను అక్కడి స్వచ్చంద సంస్థలు, ఆయా దేశాల రాయబార కార్యాలయ ప్రతినిధులు, న్యాయవాదుల సహాయంతో వారి ఆటకట్టిస్తోంది. వారిమీద కేసునమోదు చేయించి నిందితులను స్వదేశానికి రప్పించడం, లేదంటే వారి పాస్ పోర్టును రద్దుచేయడం చేస్తుంది. తాజాగా నిందితులైన ఐదుగురి పాస్ పోర్టులను ఎన్ ఆర్ ఐ మహిళా విభాగం రద్దుచేయించడంలో విజయం సాధించింది. వారి పాస్ పోర్టు రద్దైన విషయాన్ని ఎన్ ఆర్ ఐ కేంద్రం ఆ దేశ రాయబార కార్యాలయ అధికారులకు తెలియజేస్తారు. దీంతో పాస్ పోర్టు రద్దైన వ్యక్తి ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లే. అలాంటి వారిని ఆ దేశచట్టాల ప్రకారం బలవంతంగా తమ సొంత దేశానికి తిప్పి పంపిస్తారు. అలా ఇక్కడికివచ్చిన విదేశీ అల్లుడి సంగతిని ఇక్కడి మన పోలీసులు చూసుకుంటారు.

విదేశాల్లో భార్యలపై వేధింపులకు పాల్పడేవారిపై గతంలో సీఐడీ అధికారులు దర్యాప్తుచేసేవారు. కేసునమోదు చేసి ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసేవారు. అయితే ఏదైనా దేశంలో నేరం నమోదైనప్పుడు నిందితుడు ఉంటున్న దేశంలోనూ అది నేరంగా పరిగణించినప్పుడు మాత్రమే రెడ్ కార్నర్ నోటీసు జారీచేయడం సాధ్యమవుతుంది. అయితే చాలా దేశాల్లో మనదేశంలోలాగా వరకట్నం వేధింపులను నేరంగా పరిగణించరు. దీంతో అమెరికా, ఐరోపా దేశాల్లో వారిపై ఇచ్చిన రెడ్ కార్నర్ నోటీసులు నిలిచిపోయేవి. దీన్ని ఆసరాగా చేసుకొని విదేశీ అల్లుళ్లు రెచ్చిపోయేవారు. ఏమి చేసినా అడిగేవారులేరు అనే ధీమాతోఉండేవారు. ఇప్పుడు కొత్తగా తెచ్చిన చట్టంతో వారికి కళ్లేం పడినట్లైంది.

Tags

Read MoreRead Less
Next Story