ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో 44కి చేరిన మృతుల సంఖ్య

ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో 44కి చేరిన మృతుల సంఖ్య

fire-accident

దేశరాజధానిలో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణమేదైనా... మృత్యువాత పడింది మాత్రం సాధారణ కార్మికులే. ఏం జరుగుతుందో తెలిసే లోపే పదుల సంఖ్యలో కార్మికులు, స్థానికులు మృత్యువాతపడ్డారు. వీరంతా అగ్నిప్రమాదంవల్ల ఏర్పడిన దట్టమైన పొగకారణంగా ఊపిరాడక చనిపోయినట్టు తెలుస్తోంది. గాఢ నిద్రలో ఉన్న వేళ కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 44 మంది చనిపోగా... తీవ్రంగా గాయపడ్డ దాదాపు 50 మందిని సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

అనాజ్‌మండిలో నడుస్తున్న ఓ ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కార్మికులు, చుట్టుపక్కల వాళ్లు గాఢ నిద్రలో ఉన్నారు. చుట్టుముట్టిన పొగకు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మరికొందరు నిద్రలోనే కన్నుమూసినట్టు చెప్తున్నారు. మంటల కంటే.. పొగ కారణంగానే ఎక్కువ ప్రాణనష్టం సంభవించినట్టు అగ్ని మాపక దళం ఉన్నతాధికారులు చెప్తున్నారు.

రోడ్డు ఇరుకుగా ఉండటంతో చాలాసేపటి వరకు లోపలకు వెళ్లేందుకు వీల్లేకుండా పోయింది. అయినప్పటికీ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగించారు. పొగ కమ్మేయడం వల్లే ఎక్కువ నష్టం వాటిల్లినట్టు చెప్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు 30 ఫైర్‌ ఇంజన్లు నిర్వరామంగా పనిచేశాయి. అయినప్పటికీ.. జరగాల్సిన ప్రాణ నష్టం జరిగిపోయింది. అగ్నిప్రమాదంతో సంఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారిని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీ ట్వీట్‌ చేశారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story