జలదిగ్భంధంలో తమిళ ప్రజలు.. 22 మంది మృతి

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలకు జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 14 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటి వరకు వర్షాల కారణంగా 22 మంది మృతి చెందారు. మెట్టుపాళ్యంలో 18 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పుదుకోట్టై, రామనాథపురం, అరియలూర్, శివగంగై, పెరంబలూర్ జిల్లాల్లో వర్షం కురిసింది. కడలూరులో వంతెన తెగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కడలూరులో వేలారు నది పొంగి ప్రవహిస్తుంది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
తమిళనాడు, పుదుచ్చేరిలో పాఠశాలలు, కళాశాలలను మూసేశారు. మద్రాస్ విశ్వవిద్యాలయం, అన్నా విశ్వవిద్యాలయాల్లో పరీక్షలను వాయిదా వేశారు.176 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ట్యుటికోరిన్, కుద్దలూర్, తిరునెవెల్లి జిల్లాల్లో ఏర్పాటుచేసిన సహాయ శిబిరాల్లో వేలమందికి ఆశ్రయం కల్పించారు. బలమైన గాలులు వీస్తున్నందున కొమోరిన్, లక్ష్యద్వీప్ ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని తుఫాను హెచ్చరిక కేంద్రం సూచించింది. మరో 24గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. నవంబర్ 29 నుంచి ఇప్పటివరకు వర్షాల కారణంగా 22 మంది చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com