భూమి కబ్జా.. తల్లి, కూతురు ఆత్మహత్యాయత్నం

suicide-attempt

తమ వ్యవసాయ భూమిని ఓ భూస్వామి కబ్జా చేశాడని తల్లి, కూతురు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. బోయిన్‌పేటకు చెందిన కొంతం లక్ష్మి, స్వాతి అనే తల్లీ కూతుళ్లు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. సర్వే నెంబర్‌ 992లో తమకున్న 20 గుంటల భూమిని కామోజ్ఞుల రామన్న కబ్జా చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమను భూమిలో రానివ్వడం లేదంటున్నారు. భూ రికార్డులు తమ పేరున ఉన్నా.. పోలీసులు పట్టించుకోవడంలేదంటున్నారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌ వద్ద కూర్చోబెట్టి పంపుతున్నారని బాధిత తల్లీ, కూతుళ్లు ఆరోపిస్తున్నారు. తమ పొలంలో ఆ భూస్వామి దున్నుతున్నాడని తెలుసుకుని కిరోసిన్‌ వెంటతీసుకుని తల్లీ, కూతురు అక్కడికి వెళ్లారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అయితే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.