అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్

ayodya

వివాదాస్పద అయోధ్య భూమిని రామాలయ నిర్మాణం కోసం హిందువులకు ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. జమాతే ఉలేమా హింద్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. మొత్తం 217 పేజీల పిటిషన్‌ను ఆయన దాఖలు చేశారు. హిందువులకు అనుకూలంగా తీర్పును ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయోధ్య కేసులో ఫస్ట్ రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమాతే ఉలేమా హింద్ సంస్థ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. అయోధ్య కేసులో గత తీర్పును పున:సమీక్షించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై మెజార్టీ ముస్లింలు సంతోషంగా లేరని జమాతే ఉలేమా హింద్ పేర్కొంది. ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు కట్టారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ అని గుర్తు చేసిన జమాతే ఉలేమా హింద్, ఆ ఆరోపణను నిరూపించలేకపోయారని తెలిపింది. ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు కట్టారని వాదనకు సంబంధించి సరైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని జమాతే ఉలేమా హింద్ గుర్తు చేసింది. ఓ వైపు ఆలయాన్ని కూల్చారనడాకి ఆధారాలు లేవంటూనే తుది తీర్పు మాత్రం రామాలయ నిర్మాణానికి అనుకూలంగా ఇవ్వడం సందేహాస్పదంగా ఉందని అభిప్రాయపడింది. పరస్పర విరుద్ద వ్యాఖ్యల కారణంగానే రివ్యూ పిటిషన్ వేశామని వివరించింది.

అయోధ్య కేసులో రివ్యూ పిటిషన్ వేయాలని గత నెలలోనే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్టు నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పుపై ముస్లిం లా బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 5 ఎకరాల భూమి తమకు అవసరం లేదని తెలిపింది. తమకు కూడా 67 ఎకరాల్లోనే భూమి ఇవ్వాలని డిమాండ్ చేసింది. సుప్రీం తీర్పులో లొసుగులు ఉన్నాయని.. తమను నిరాశపరిచిందని ముస్లిం లా బోర్డు సభ్యులు పేర్కొన్నారు.

యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అయోధ్య కేసులో సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయవద్దని సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు, సున్నీ వక్ఫ్ బోర్డు సమావేశంలో కీలక తీర్మానం చేశారు. లక్నోలో జరిగిన ఈ మీటింగ్‌కు ఏడుగురు సభ్యులు హాజరయ్యారు. ఒక సభ్యుడు హాజరు కాలేదు. సుప్రీంకోర్టు తీర్పు, అయోధ్య పూర్వాపరాలు, భవిష్యత్ కార్యాచరణ పై సుదీర్ఘంగా చర్చించారు. రివ్యూ పిటిషన్ వేయకపోవడమే మంచిదని ఆరుగురు సభ్యులు అభిప్రాయపడగా, సమీక్ష కోరదామని మరో సభ్యుడు అభిప్రాయపడ్డారు. విస్తృత చర్చల తర్వాత, సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ వేయరాదని నిర్ణయించారు. ఐతే, 5 ఎకరాల భూమిని తీసుకోవడంపై సున్నీ వక్ఫ్ బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Tags

Read MoreRead Less
Next Story