100కు దగ్గర్లో ఆర్ఎస్ఎస్.. తెలంగాణాలో జెండా పాతేందుకు వ్యూహం

100కు దగ్గర్లో ఆర్ఎస్ఎస్.. తెలంగాణాలో జెండా పాతేందుకు వ్యూహం

rss

మరో ఐదేళ్ళలో వందేళ్ళు పూర్తి చేసుకోనున్న ఆరెస్సెస్.. దేశంలో మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ సైద్ధాంతికకర్తగా ఆ పార్టీ ఎదుగుదలే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా బలహీన ప్రాంతాల్లో బలోపేతం కావడంపై సంఘ్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇప్పుడు తెలంగాణను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. తాను బలపేతం అవుతూ.. బీజేపీ ఎదుగుదలకు బాటలు వేయాలని సంకల్పించింది.

95 ఏళ్ల క్రితం ఈ దేశానికి పరిచయమైన ఆరెస్సెస్.. కాలక్రమంలో ఎన్నో అవమానాలు, అపవాదులు ఎదుర్కొంది. ఒడిదుడుకులను తట్టుకుంటూ అంచెలంచెలుగా ఎదిగింది. గాంధీజీ హత్య, స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకోకపోవడం వంటి ఎన్నో ఆరోపణలున్నా.. అవి, ఆరెస్సెస్ ను దేశ ప్రజలకు దూరం చేయలేకపోయాయి. 1925లో ఓ చిరు సంస్థగా ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. మరో ఐదేళ్లలో వందేళ్లు పూర్తిచేసుకోబోతోంది.

1925 సెప్టెంబర్ 27 విజయదశమి రోజున డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ సంఘ్ ను స్థాపించారు. అలా మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో ఆయన సొంతింట్లో సంఘ్ పురుడుపోసుకుంది. సమీపంలోని మైదానంలో ఓ ఐదారుమందితో ప్రారంభమైన సంస్థ నేడు శాఖోపశాఖలుగా విస్తరించింది. హెడ్గేవార్ పూర్వీకులు తెలంగాణకు చెందినవారే. బోధన్ దగ్గర్లోని కందకుర్తి ఆయన పూర్వీకుల స్వగ్రామం. అంటే, ఒక రకంగా హేగ్డేవార్ తెలంగాణకు చెందినవాడే. అయితే, ఆయన సొంత రాష్ట్రంలో ఆరెస్సెస్ అంతంతమాత్రంగానే ఎదిగింది. ఇక, ఆపరేషన్ సౌత్ లో భాగంగా.. ఇప్పుడు తెలంగాణలోనూ బలోపేతం కావడానికి తీవ్రంగా శ్రమిస్తోంది.

తాజాగా హైదరాబాద్ లో విజయ సంకల్ప సభను నిర్వహించింది ఆరెస్సెస్. ఈ సభలో సంఘసేవకులకు మోహన్ భగవత్ దిశానిర్దేశం చేశారు. మూడు రోజుల పాటు జరిగిన విజయ సంకల్ప సభకు వేలాదిగా జనం తరలిరావడంతో భగవత్ ఓ రేంజిలో ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన కొత్త వ్యక్తులు సరికొత్త సవాళ్లను అధిగమిస్తారని.. పరోక్షంగా మోదీని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మోదీకి తిరుగులేదన్న రీతిలో లో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని మోదీ సర్కారు పక్కాగానే అమలు చేస్తుందని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా మోదీ సర్కారు విజయం సాధిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా తనదైన శైలి వ్యాఖ్యలతో మోదీకి డబుల్ శక్తిని ఇచ్చేసిన భగవత్.. పరోక్షంగా టీఆర్ఎస్ సహా.. బీజేపీ వైరి వర్గాలపై విరుచుకుపడ్డారు.

ఇక, మోహన్ భగవత్ ఇచ్చిన జోష్ తో తెలంగాణ బీజేపీ నేతల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ విస్తరణకు విజయ సంకల్ప సభ ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నిజానికి, తెలంగాణలో బలపడేందుకు ఆరెస్సెస్, బీజేపీ పక్కా స్కెచ్ తో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. 2024 లోగా 10 వేల గ్రామాల్లో శాఖల ఏర్పాటు.. ఐదు లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా ఆరెస్సెస్ కసరత్తు ప్రారంభించింది.

హిందుత్వ భావ జాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు తెలంగాణ అనువైందే అయినా.. ఇప్పటిదాకా ఆ దిశగా దృష్టి సారించలేదు. ఇప్పుడు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగింది. సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణ పల్లెల్లో జెండా ఎగరేయాలనేది ఆరెస్సెస్ తాజా ఆలోచన. మూడు రోజుల విజయసంకల్ప సభలో దీనిపైనే సంఘసేవకులకు దిశానిర్దేశం చేసిన మోహన్ భగవత్.

ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్ల క్రితం ఆరెస్సెస్ ముఖ్య శిక్షక్, కార్యకర్తలకు శిబిరాలు నిర్వహించింది. 1999లో కర్నూలు, కరీంనగర్‌లలో వాటిని ఏర్పాటు చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆరెస్సెస్ శిబిరాన్ని నిర్వహించింది. 2017లో కరీంనగర్‌లో సాధారణ శిబిరం, ఘట్‌కేసర్‌ సమీపంలో జాతీయ స్థాయి కార్యనిర్వహక కమిటీ సమావేశాలు జరిగినా.. రాష్ట్రవ్యాప్త శిబిరం మాత్రం ఇదే. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు 2,500 శాఖలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 3,200కు పెరిగాయి. వాటిని 12 వేలకు పెంచాలనేది తాజా లక్ష్యంగా ఆరెస్సెస్ ముందుకు సాగుతోంది. అటు, ఆరెస్సెస్ విజయ సంకల్ప సభతో తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త జోష్ కనబడుతోంది. ఈ సభకు హాజరైన తెలంగాణ బీజేపీ నేతలంతా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనన్న దీమాతో వున్నారు.

మొత్తానికి, ఆరెస్సెస్ ప్రోత్బలంతోనే దేశంలో వేళ్లూనుకున్న బీజేపీ.. ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణలోనూ అనుసరించాలనే ఉద్దేశంలో ఉంది. ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని భావిస్తోంది. ఇటీవల పలు సందర్భాల్లో బీజేపీ నేతలు కూడా తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతూ ఊదరగొడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకున్న తర్వాత ఈ ఊపు మరింత ఎక్కువైంది. ఎలాగైనాసరే తెలంగాణలో జెండా పాతాల్సిందేననే పట్టుదలతో పార్టీ ఢిల్లీ పెద్దలున్నారు. ఇందుకు ఆరెస్సెస్ కూడా తోడు కావడంతో తమకు ఇక తిరుగుండదనే ఉత్సాహంలో వున్నారు బీజేపీ నేతలు.

Tags

Read MoreRead Less
Next Story