మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ.. మరోసారి కశ్మీర్ అంశంపై స్పందించిన ట్రంప్

మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ.. మరోసారి కశ్మీర్ అంశంపై స్పందించిన ట్రంప్

వద్దన్న పని చేయడం అమెరికా అధ్యక్షునికి అలవాటుగా ఉన్నట్లుంది. మీ జోక్యమే వద్దు అని భారతదేశం పదే పదే చెబుతున్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్‌ పట్టించుకోవడం లేదు. తాజాగా మరోసారి అదే మాట మాట్లాడారు. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. కశ్మీర్‌ అంశాన్ని తాము జాగ్రత్తగా గమనిస్తున్నామని ట్రంప్ తెలిపారు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌లలో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదించారు. రెండు దేశాల మధ్య శాంతి స్థాపన కోసం చేయగలిగినంత చేస్తామన్నారు.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షడు ట్రంప్‌తో భేటీ అయ్యారు. దావోస్‌లో జరిగిన ఈ మీటింగ్‌లో కశ్మీర్ అంశాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. కశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాల మద్ధతు లేకపోవడం, అంతర్జాతీయ వేదికలపై తమ వాదన చెల్లకపోవడంతో మూడో దేశం జోక్యానికి ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా కలగచేసుకోవాలని కోరుతున్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా మాత్రమే చొరవ చూపగలదని చెప్పుకొస్తున్నారు. ఐతే, కశ్మీర్‌పై మూడో దేశం జోక్యం అవసరం లేదని భారతప్రభుత్వం తేల్చి చెప్పింది. కశ్మీర్ అంశం భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక వ్యవహారమని స్పష్టం చేసింది. పైగా, పీఓకేపై మాత్రమే చర్చలుంటాయని కుండబద్దలు కొట్టింది. అమెరికాకు కూడా ఇదే విషయాన్ని రెండు, మూడు సార్లు స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ ట్రంప్ ఖాతరు చేయడం లేదు. వచ్చే నెల ట్రంప్ భారత పర్యటనకు వచ్చే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story