ఢిల్లీ సీఎంగా ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయటానికి సిద్ధమైన కేజ్రీవాల్

ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రఖ్యాత రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. కేజ్రీవాల్‌తో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నోటిఫికేషన్ జారీ చేశారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్‌లకు మంత్రులుగా ఛాన్స్ లభించింది. ప్రమాణ స్వీకారానికి వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. ప్రధానమంత్రి మోదీ సహా ప్రభుత్వ పెద్దలకు ఆహ్వానాలు పంపారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకుల కు ఇన్విటేషన్స్ ఇచ్చారు.

ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్షనేతగా కేజ్రీవాల్‌ను ఇప్పటికే ఎన్నుకున్నారు. అనంతరం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుపై సంసిద్ధత వ్యక్తం చేశారు. అలాగే, కేబినెట్‌లో రాఘవ్ చద్దా, అతిషీలకు కూడా చోటు లభిస్తుందని ప్రచారం జరిగింది. ఆప్ ప్రచారం, విజయంలో వారిద్దరిదీ కీలక పాత్ర. 31 ఏళ్ల రాఘవ్ చద్దా చార్టెడ్ అకౌంటెంట్. ఆప్‌లో చేరి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ఆర్థికశాఖ బాధ్యతల్లో పాలుపంచుకున్నారు. ప్రచార వ్యూహాలను రూపొందించారు. ఆతిషి, విద్యారంగ సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. దాంతో వారిద్దరికీ మంత్రి వర్గంలో అవకాశమిస్తారని వార్తలు వచ్చాయి. ఐతే, ప్రస్తుతానికి వారికి ఛాన్స్ ఇవ్వలేదు.

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ ఉపాధ్యాయులను పిలవడం వివాదం రేపింది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆహ్వానం పంపింది. ప్రతి స్కూల్ ప్రిన్సిపల్ తనతో పాటు 20 మంది టీచర్లను తీసుకురావాలని ఆదేశించింది. కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని సూచించింది. ఇది విమర్శలకు దారి తీసింది. కేజ్రీవాల్ ప్రభుత్వం తన స్వప్రయోజనాలకు విద్యా వ్యవస్థను వాడుకుంటోందని విపక్షాలు విమర్శించాయి. ఈ విమర్శలను ఆప్ తోసిపుచ్చింది. తమ పార్టీ విజయంలో విద్యారంగంలో సంస్కరణలు, టీచ
ర్లది కీలక పాత్ర అని గుర్తు చేసింది.

ఇదిలా ఉంటే, కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి మోదీ హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆదివారం నాడు మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. కాశీలో 30కి పైగా ప్రాజెక్టులను ప్రారంభించను న్నారు. ఈ ప్రోగ్రామ్ ముందుగానే ఖరారు కావడంతో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి మోదీ రాకపోవచ్చని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. మొదటిసారి 2013 డిసెంబర్‌లో ఢిల్లీ సీఎం బాధ్యతలు చేపట్టారు. అప్పడు కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీ, 49 రోజులకే రాజీ నామా చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాల్లో సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2015 ఫిబ్రవరి 14న రామ్‌లీలా మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన కేజ్రీ, ఫిబ్రవరి 14న ప్రమాణం చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. ఐతే, ఫిబ్రవరి 14 పుల్వామా అమరవీరుల దినం కావడంతో ప్రమాణ స్వీకార తేదీని మార్చుకున్నట్లు సమాచారం.

Recommended For You