69వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

69వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి ఉద్యమం సోమవారంతో 69వ రోజుకు చేరింది. 3 రాజధానుల ప్రకటనపై ప్రభుత్వం దిగొచ్చే వరకు శాంతియుతంగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు రైతులు. సేవ్ అమరావతి, జై అమరావతి అంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అయినా ఉద్యమమే ఊపిరిగా పోరాటం ముమ్మరం చేస్తున్నారు రాజధాని రైతులు. 29 గ్రామాల్లోనూ నిరసనలు హోరెత్తాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, పెనుమాక, యర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డులో ధర్నాలు, దీక్షలు కొనసాగుతున్నాయి.

69 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాలన చలనం లేని రాయిలా ఉందని మండిపడుతున్నారు. అమరావతి నుంచి రాజధాని మారిస్తే జగన్‌ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నగరంలో చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్ నుంచి.. హిందూ కాలేజీ వరకు ర్యాలీ చేపట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని.. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

రాయపూడిలో ప్రతి ఆదివారం ఒక్కో దేవుడిని పూజిస్తూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వేడుకుంటున్నారు. దళిత మహిళలు, రైతు కూలీలు తమ ఇష్టదైవం అయిన నిర్మలగిరి మేరిమాతను ప్రార్ధిస్తూ రాజమండ్రి వెళ్లారు.

భూములిచ్చిన రైతులపై జాలి చూపకపోగా.. ఉద్యమాన్ని అణచివేసేలా కుట్రలు పన్నుతున్నారని మండిపడుతున్నారు రైతులు. ప్రజా క్షేత్రంలో జగన్‌ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. తాము ప్రభుత్వానికి భూములు ఇచ్చి మోసపోయామని.. మీరు కూడా భూములు ఇచ్చి రోడ్డున పడొద్దంటూ విశాఖ వాసులకు సూచిస్తున్నారు రైతులు.

Read MoreRead Less
Next Story