చంద్రబాబు కుప్పం పర్యటన.. బ్యానర్ల విషయంలో వైసీపీ-టీడీపీ మధ్య రగడ

ప్రజా చైతన్య యాత్రల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలు సోమవారం నుంచి పునఃప్రారంభం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. చంద్రబాబు సోమవారం చిత్తూరు జిల్లాలోని తన నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. బెంగళూరు మీదుగా కుప్పం వెళ్లి రెండు రోజులపాటు ఆ నియోజకవర్గంలో పర్యటిస్తారు. బుధవారం ఉదయం అక్కడ బయలుదేరి అమరావతికి వస్తారు. గురువారం విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్తారు. ఎస్‌ కోట, గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లో ఆయన పర్యటన జరుగుతుంది. శుక్రవారం విశాఖ నగరంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడి వివాహ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కానున్నారు.

మరోవైపు.. చంద్రబాబు కుప్పం పర్యటనతో రాజకీయం వేడెక్కింది. ప్లైక్సీలు, బ్యానర్ల విషయంలో వైసీపీ- టీడీపీ మధ్య రగడ జరుగుతోంది. 15 రోజుల క్రితం మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సందర్బంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే పర్యటన ముగిసినప్పటికీ బ్యానర్లు తొలగించేందుకు వైసీపీ శ్రేణులు అంగీకరించడం లేదు. మాములుగా ఎవరిదైనా పర్యటన ఉంటే ఒకటి రెండ్రోజుల ముందు ప్లెక్సీలు ఏర్పాటు చేసుకుని.. ఆ తర్వాత తీసేస్తారు. కానీ మంత్రి పెద్దిరెడ్డి వచ్చి 15 రోజులైనా ఇప్పటి వరకు బ్యానర్లు తొలగించలేదు. దీంతో మున్సిపల్‌ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. వైసీపీ పార్టీ బ్యానర్లు తొలగించాలని కోరారు. కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఒక్క బ్యానర్ కూడా తొలగించకపోవడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. సోమవారం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏం జరుగుతుందో ఏమో..? అనే టెన్షన్.. టెన్షన్ నెలకొంది.

Recommended For You