జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ సోమవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాల్లో ఒకటైన జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాటు చేశారు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు. అధికారం చేపట్టిన తర్వాత సీఎం జగన్‌ తొలిసారి జిల్లాకు వస్తుండటంతో.. ఏ మాత్రం లోపం లేకుండా, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అటు.. ఈ కార్యక్రమానికి భారీగా జనసమీకరణ చేస్తున్నారు జిల్లా వైసీపీ నాయకులు.

ఏ కారణంతోనూ విద్యార్ధుల చదువుకు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో.. నవరత్నాలలో ఒకటైన జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని విజయనగరంలో ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షల మందికి ఈ పథకం కింద ఏడాదికి 20 వేల రూపాయలు అందిస్తారు. ఉన్నత చదువులు చదువుకునే విద్యార్ధిని, విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు విద్యార్ధుల వసతి, భోజనఖర్చుల కోసం ఈ డబ్బును అందిస్తారు.

ఇక ఈ కార్యక్రమంతో పాటు ప్రభుత్వం మహిళ భద్రత కోసం, సత్వర న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న దిశా మహిళా పోలీస్‌ స్టేషన్‌ను కూడా ప్రారంభిస్తారు సీఎం జగన్‌. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ. సీఎం జగన్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు జిల్లా అధికారులు.

Recommended For You