2020 -21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న టీటీడీ పాలకమండలి

2020 -21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న టీటీడీ పాలకమండలి

శనివారం జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా 165 అంశాలపై పాలకమండలి సుదీర్ఘంగా చర్చించనుంది. మొదట 2020 -21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి ఆమోదం తెలపనుంది. సుమారు 3150 కోట్ల రూపాయల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ ఉండే అవకాశం ఉంది. అలాగే స్విమ్స్‌ హాస్పిటల్స్‌కు 100 కోట్ల రూపాయలు, గరుడ వారధికి రూ.100 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

తిరుమలలో మూడో దశలో 1300 సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంతో పాటు.. దేశంలోని వివిధ నగరాల్లో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాల్లో.. సుమారు 250మంది సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది పాలకమండలి.. పద్మావతి అతిథి గృహాన్ని తుడా పరిధిలోకి అప్పగించే కార్యక్రమానికి ఆమోదం తెలపడంతో పాటు.. టీటీడీలోని పలువురు ఏఈలకు డిప్యూటీ ఈఓలుగా పదోన్నతి కల్పించడం, ఎస్వీబీసీకి టీటీడీ తరపున ఇచ్చే నిధులను తగ్గించి స్వయంగా ఆదాయాన్ని సమకూర్చుకునేలా చర్యలు తీసుకునే అంశాలపై టీటీడీ పాలమండలి చర్చించనుంది.

మరికొన్ని ముఖ్యమైన అంశాలపై కూడా పాలకమండలి చర్చించనుంది. టీటీడీలో ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ఫైనాన్సియల్ సబ్ కమిటీ పలు సూచనలు చేసింది. ఈ ఏడాది టీటీడీకి ఉపయోగకరం కాని ఆస్తుల విక్రయాలు, కాటేజి డొనేషన్ విధానం ద్వారా 100 కోట్ల రూపాయలు సేకరించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. టీటీడీలో ఇక కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల నియామకం నిలిపివేయాలని కమిటీ సూచించింది. టీటీడీ బ్రాండ్ ను వినియోగించుకొని బంగారం, వెండి డాలర్లతో పాటు మంగళసూత్రాలు విక్రయాలు ద్వారా ఆదాయం పెంచుకోవాలని, నిపుణుల ద్వారా పరిశీలన జరపాలని సూచించింది. వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో ప్రైవేటు బ్యాంకుల్లో గతంలో మాదిరిగా డిపాజిట్లు చెయ్యాలని కమిటీ సూచించింది. వీటన్నింటినిపైనా శనివారం పాలకమండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

Tags

Read MoreRead Less
Next Story