అధికారపార్టీ కక్షసాధింపు చర్యలే టీడీపీ నేత ఆత్మహత్యాయత్నానికి కారణం

అధికారపార్టీ కక్షసాధింపు చర్యలే టీడీపీ నేత ఆత్మహత్యాయత్నానికి కారణం

వైసీపీ నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక.. శ్రీకాకుళం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు చౌదరి బాబ్జి తనయుడు అవినాష్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. ఎచ్చెర్ల మండలం SMపురం టీడీపీ మాజీ సర్పంచ్‌గా పనిచేసిన చౌదరి అవినాష్‌.. ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌ పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించారు. దీనికి వైసీసీ నేతలు, పోలీసుల వేధింపులే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం అవినాష్‌ను కిమ్స్‌ తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి సీరియస్‌గానే ఉందంటున్నారు.

ఇటీవల అవినాష్‌ దాతల సహాయంలో స్వగ్రామమైన SMపురంలో శివాలయం నిర్మించారు. ఈ విషయంలో వైసీపీ నేతలతో ఆయనకు తగాదా వచ్చింది. గ్రామంలో వ్యక్తులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారి నుంచి కూడా చందాలు వసూలు చేసి ఈ ఆలయం కడుతున్నారు. ఐతే.. గుడికి పెద్ద మొత్తంలో చందా ఇచ్చిన ఓ దాత ద్వారా YCP నేతలు రాజకీయం మొదలుపెట్టారు. ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తామే నిర్వహిస్తామని వైసీపీ నేతలు పట్టుబట్టడంతో.. వివాదం పెద్దదైంది. దీంతో 2 వర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. దీనికి సంబంధించి స్థానిక ఎస్సై అవినాష్‌కు స్టేషన్‌కు పిలిపించి.. ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా.. అక్కడ కూడా ఖాకీలు అధికార పార్టీకే సపోర్ట్ చేయడంతో అవినాష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ ఆవేశంలోనే ఎచ్చర్ల పీఎస్‌ పైనుంచి దూకారు. ఖాకీల అండతో SMపురంలో జగన్ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారని కొన్నాళ్లుగా అవినాష్ చెప్తూనే ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు. రాష్ట్రంలో YCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఆ కక్షసాధింపు రాజకీయలే ఇప్పుడు అవినాష్ సూసైడ్ యత్నానికి కారణమని చెప్తున్నారు. అవినాష్‌ ఆత్మహత్య యత్నానికి పోలీసులే బాధ్యత వహించాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story