ఇర్ఫాన్ ఖాన్‌పై అభిమానం.. ఊరిపేరునే మార్చేశారు

ఇర్ఫాన్ ఖాన్‌పై అభిమానం.. ఊరిపేరునే మార్చేశారు

మంచి వ్యక్తులు మరణించీ జీవిస్తారు. ఆ గ్రామ ప్రజలకు నటుడు ఇర్ఫాన్ అంటే ఎంత ఇష్టం అంటే అతడి సినిమాని 10 సార్లు చూడడమో, పోస్టర్లకు పాలాభిషేకం చేయడమో, గుడికట్టించడమో లాంటివి కాదు.. ఏకంగా గ్రామం పేరునే మార్చుకునేంత ఇష్టం. అతడికి వారి గుండెల్లో గుడి కట్టారు. ఇర్ఫాన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని తెలిసి తల్లడిల్లి పోయారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కానీ దేవుడు వారి మొర ఆలకించలేదు. నటుడిగా నీ పాత్ర ముగిసిపోయిందని తీస్కెళ్లిపోయాడు.

ఇర్ఫాన్ తనువు చాలించి 12 రోజులైనా అతడి జ్ఞాపకాలు వారి కళ్లలో మెదులుతూనే ఉన్నాయి. అందుకే అతడి జ్ఞాపకార్థం ఇగత్‌పురిని మార్చి హీరో-చి-వాడి (నైబర్ హుడ్ హీరో) అని పేరు పెట్టారు. దేశం ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్న సమయంలో మహారాష్ట్ర ఇగత్ పురి వాసులు ఊరి పేరు మార్చి నివాళులు అర్పించుకున్నారు. గ్రామస్తులు ఇర్ఫాన్‌తో తమకున్న అనుబంధాన్ని ఇలా వివరించారు. ఓసారి ఇర్ఫాన్ ఇగత్‌పురిలోని త్రింగల్వాడి కోటకు ఒక భూమిని కొనడానికి వచ్చాడు. దాని చుట్టూ కొన్ని ఆదివాసీ కుగ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రాధమిక సౌకర్యాలు లేకపోవడాన్ని ఆయన గుర్తించారు. వారి దయనీయ పరిస్థితిని చూసి ఇర్ఫాన్ చలించి పోయాడు.

గ్రామ అభివృద్ధికి కృషి చేశాడు. అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపాడు. గ్రామంలోని సమస్యలను చర్చించడం, వాటిని పరిష్కరించడంతో పాటు పండుగల సమయాల్లో ఆటపాటల్లో పాలు పంచుకునేవారు. గిరిజనుల పిల్లలకు పుస్తకాలు, స్వెటర్లు, కంప్యూటర్లు వంటి అవసరమైన వస్తువులను సమకూర్చేవారు. ఊరి బాగు కోసం క్రమం తప్పకుండా విరాళాలు అందించేవారు.

ఊరికి అత్యవసర సర్వీసుల నిమిత్తం ఓ అంబులెన్స్, పాఠశాల నిర్మాణానికి అయ్యే ఖర్చును ఆయనే భరించారని ఇగత్‌పురి జిల్లా పరిషత్ సభ్యుడు గోరఖ్ బోడ్కే అన్నారు. గ్రామంలో సినిమా థియేటర్ లేనప్పటికీ 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇర్ఫాన్ సినిమాని పిల్లలు, పెద్దలు తప్పనిసరిగా చూసేవారు. గ్రామస్థుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయాడు నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఏప్రిల్ 29న తుది శ్వాస విడిచిన ఇర్ఫాన్ ఖాన్‌కి బాలీవుడ్ ఘనమైన నివాళి అర్పించింది.

Tags

Read MoreRead Less
Next Story