మారుమూల పల్లె నుంచి యూట్యూబ్‌ హీరోగా.. 20 ఏళ్ల కుర్రాడి కథ

మారుమూల పల్లె నుంచి యూట్యూబ్‌ హీరోగా.. 20 ఏళ్ల కుర్రాడి కథ

మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే. అవును. మనం ఒక టార్గెట్‌ పెట్టుకుని దాన్ని రీచ్‌ అవ్వాలంటే ముందు ఒక అడుగు వేయాలి. ఆ అడుగుకు ఎవరూ తోడు ఉండరు. నిజాయితీనే మన తోడవ్వాలి. పట్టుదల, కార్యదక్షత, క్రమశిక్షణే ఆయుధమవ్వాలి. అలాంటపుడే విజయం మన సొంతమవుతుంది. అలాంటి విజయం సాధించినపుడు కలిగే ఆనందానికి అవధులుండవు. ఆ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేయడానికీ 24 గంటలు సరిపోవు. ఎక్కడో ఒక మారుమూల పల్లె నుంచి వచ్చిన ఒక 20 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు ఇలాంటి ఆనందాన్నే పొందుతున్నాడు.

Bayya Sunny Yadav

బయ్యా సన్నీ యాదవ్‌. ఊరు నల్లగొండ జిల్లా నూతనక్కల్‌. వయసు కేవలం 20 ఏళ్లే. కానీ.. యూట్యూబ్‌లో అతని వీడియోలు చూసే వాళ్లు మాత్రం లక్షల మంది ఉన్నారు. ఎక్కువమందికి తెలియని మోటో వ్లాగింగ్‌ను తెలుగు ప్రజలకు పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి. అలా చెప్పుకునేకంటే.. అప్పటికీ ఇంగ్లీష్‌లో వ్లాగింగ్‌ని ఊదరగొట్టి మిలియన్ల ఫాలోవర్లను సంపాదించిన వాళ్ల పక్కకు వచ్చి నేనున్నానంటూ నిలబడ్డాడు' అని చెప్తే కరెక్ట్‌గా ఉంటుందేమో.

Bayya Sunny Yadav

పచ్చళ్లు ఎలా పెట్టాలి? వంటలు ఎలా చేయాలి? పిల్లల రైమ్స్‌, తెలుగు సినిమా పాటలు. నిన్నమొన్నటివరకూ యూట్యూబ్‌లో జనం ఇవే చూసేవాళ్లు. కానీ.. అలాంటి వాళ్లకు మోటో వ్లాగింగ్‌ని వ్యసనంగా మార్చిపడేశాడు సన్నీ. ఎందుకంటే చాలామందికి ప్రపంచాన్ని చుట్టేయాలనే కోరిక ఉంటుంది. కొత్తకొత్త ప్రదేశాలను ఎక్స్‌ప్లోర్‌ చేయాలనే ఉత్సాహం ఉంటుంది. కానీ..రకరకాల కారణాల వల్ల వెళ్లలేని పరిస్ధితి. అలాంటి వాళ్లకు తామే ఆ రైడ్‌లో ఉన్న ఫీలింగ్‌ కలిగించేలా వీడియోలు చేసి సక్సెస్‌ అయ్యడు సన్నీ. తన వీడియోల్లో పడికట్టు ఇంగ్లీష్‌ పదాలుండవు. అచ్చ తెలుగులో మాట్లాడతాడు. తాను చూస్తోందే చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రాంతాలకు వెళ్లాలనుకునేవాళ్లకు టిప్స్‌ ఇస్తాడు. ఎలా వెళ్లాలి.? ఎక్కడ స్టే చేస్తే తక్కువ ఖర్చు అవుతుంది.. ఇలా అన్నీ చక్కగా వివరిస్తాడు.

Bayya Sunny Yadav

చదువు ఏమాత్రం అబ్బని ఈ 20 ఏళ్ల కుర్రాడు కొంతకాలం అందరిలానే తిరిగాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో ముంబై, ఢిల్లీల్లో మోటో వ్లాగర్స్‌ వీడియోలు చూసి ఇన్‌స్పయిర్‌ అయ్యాడు. తాను కూడా ఫేమస్‌ మోటో వ్లాగర్‌ అవ్వాలని కలలు కన్నాడు. చాలామందిలా అంతటితో ఆగలేదు. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించాడు. కష్టపడ్డాడు. రకరకాల ప్రయత్నాలు చేశాడు. చివరికి సక్సెస్‌ అయ్యాడు. మొదట్లో అంతా కష్టంగానే ఉండేదంటాడు సన్నీ. అప్పటికే తెలుగులో వేళ్లమీద లెక్కబెట్టగలిగినంతమంది మొటోవ్లాగర్స్‌ మాత్రమే ఉన్నారు. వాళ్లందరికీ భిన్నంగా ఎలా చేయాల అని ఆలోచించాడు. మొట్టమొదటి నార్త్‌ ట్రిప్‌తోనే ఫాలోవర్స్‌ని సంపాదించాడు.

2012 అక్టోబర్‌లోనే ఛానల్‌ మొదలుపెట్టినా.. అప్పట్లో తనకు ఇష్టమైన కబడ్డీ మ్యాచ్‌లని అప్‌లోడ్‌ చేసేవాడు. ఇప్పుడంతా రైడింగ్‌ మయం. ప్రతీ మూడు రోజులకు సన్నీ పెట్టే వీడియో కోసం అతని ఛానల్‌లో ఉన్న నాలుగు లక్షల పైచిలుకు సబ్‌స్ర్కైబర్స్‌ వెయిట్‌ చేస్తూ ఉంటారు. అతని వీడియో అప్‌లోడ్‌ చేసిన గంటలోనే 50వేలు దాటుతుందంటే అతనికి ఎంత క్రేజ్‌ ఉందో ఇట్టే అర్ధమవుతుంది.

ఇప్పటివరకు లడాఖ్‌, నేపాల్‌, రాజస్ధాన్‌, సౌతిండియా రైడ్‌ ఇలా చాలా రైడ్స్‌ చేశాడు సన్నీ. అతను చేసే మోటో వ్లాగింగ్‌ వీడియోల్లో ఏదో కొత్తదనం ఉంటుందంటారు ఫాలోవర్స్‌. ఇప్పటివరకు తనను ఫాలో అవుతున్నావాళ్లకు తాను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటానని అంటాడు. రోడ్లమీద తిరుగుతానంటే ఎవరిళ్లలో ఒప్పుకోరు. కానీ.. తన తల్లిదండ్రులు మాత్రం తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించారని, దాన్ని తాను నిలబెట్టుకున్నానని గర్వంగా చెబుతాడు. ఓయో, రైనాక్స్‌ ఇలాంటి పెద్దపెద్ద బ్రాండ్స్‌కి ఇప్పుడు ఇతను ప్రమోషన్‌ చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన రైడ్స్‌ చేయాలనేది అతని ప్లాన్‌.. అవన్నీ సక్సెస్‌ అవ్వాలని మనమూ విష్‌ చేద్దాం..

కార్తీక్ పవన్

Youtube Channel : https://bit.ly/2yUVpe1

Instagram : https://bit.ly/2T0EJIQ

Tags

Read MoreRead Less
Next Story