ఏమండీ.. సినిమాకి వస్తారా..: నాగ్ అశ్విన్

ఏమండీ.. సినిమాకి వస్తారా..: నాగ్ అశ్విన్

గీ కరోనా ఏమో గానీ.. అన్నీ బందైనై. పొద్దంతా కష్టపడి అభిమాన హీరో సినిమా రిలీజైందని తోసుకుంటూ వెళ్లి టిక్కెట్టు తీసుకుని సినిమా చూసి ఎన్ని రోజులైంది. రెండు నెలల లాక్డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకున్నా సినిమా చూడ్డానికి జనం వస్తారా లేదా అన్న సందేహం ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తోంది. ఇదే విషయమై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులపై ప్రశ్నలు సంధించారు. మునుపటి మాదిరిగా థియేటర్లు కళకళలాడాలంటే ఏం చేయాలి అని.

ఓసారి నేను, నిర్మాత సురేష్ బాబు, హీరో రానా ఈ టాపిక్ గురించే మాట్లాడుకున్నాం. ప్రేక్షకులకు పాప్‌కార్న్, కూల్ డ్రింక్ బదులు.. బీరు, వైన్ అందిస్తే వస్తారా అని చర్చించుకున్నాం. అయితే ఇది మంచి ఆలోచన కాకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఫ్యామిలీతో వచ్చే వాళ్లు తగ్గిపోతారు. అంతే కాకుండా మల్టీప్లెక్సులు మాత్రమే 'మందు' అందిస్తాయి. చిన్న చిన్న థియేటర్స్ అన్నీ మూతపడతాయి. ఇది కాదు పరిష్కారం.. మరేం చెయ్యాలి మీరే చెప్పండి. సినిమా పరిశ్రమ చాలా నష్టాల్లో ఉంది. చప్పట్లు, ఈలలు, గోలలతో థియేటర్లు సందడిగా మారే రోజు వస్తుందా. ఆ రోజు రావాలంటే ఏంచేయాలి. లేదంటే ఇంకొంత కాలం వెయిట్ చేసి అప్పుడు థియేటర్లకు వస్తారా అని అశ్విన్ ట్విట్టర్ వేదికగా నెటిజన్లను అడుగుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story