చిరంజీవి సారథ్యంలో చిత్ర పరిశ్రమ..

రెండు నెలల లాక్డౌన్ అనంతరం మళ్లీ చిత్ర పరిశ్రమ పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు సమాయత్తమవుతోంది. అర్థాంతరంగా ఆగిపోయిన కొన్ని చిత్రాల షూటింగులను పూర్తి చేయాలనుకుంటోంది. ఇదే విషయమై చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యాజమాన్యాలు చిరంజీవి నేతృత్వంలో సమావేశం కానున్నారు. ప్రేక్షకుడు ఇప్పుడప్పుడే థియేటర్స్‌కి వచ్చే పరిస్థితి లేదు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు మరి కొంత కాలం ప్రభుత్వాలు చెప్పిన పద్ధతులు అనుసరించాలి. మరి సినిమాలు ఎలా రిలీజ్ చేయాలి. ఇప్పటికే కొంత మంది ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు.

కరోనా నేపథ్యంలో చిత్రీకరణ సాధ్యమా.. సెట్స్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. షూటింగ్ అనుమతుల కోసం ప్రభుత్వాలతో సంప్రదింపులు.. ఇలాంటి పలు విషయాలపై చర్చించేందుకు చిరంజీవితో టీమ్ సమాలోచనలు చేయనుంది. ముందు వీరంతా కలిసి చర్చించుకున్నాక ప్రభుత్వ అధికారులను కలవాలనుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి గత నాలుగైదు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చిరంజీవి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుకానుంది.

Recommended For You