‘మంచి’ మనోజ్.. వలస కార్మికుల కోసం బస్సులు..

తన పుట్టిన రోజును పురస్కరించుకుని హీరో మంచు మనోజ్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు ఎక్కడి వారక్కడ నిలిచిపోయారు. సడలింపుల్లో భాగంగా కార్మికులు వారి వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. కొందరు కాలిబాటన, మరికొందరు లారీలు, ట్రక్కులు ఎక్కుతూ వెళుతున్నారు. మనోజ్ కొందరికైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో రెండు బస్సులను ఏర్పాటు చేశారు. అందులో కార్మికులను వారి స్వస్థలాలకు పంపిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు వలస కార్మికులు హైదరాబాదులో ఉంటూ ఇబ్బంది పడుతున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. దీంతో వారిని సొంత ఊర్లకు తరలించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు.

బుధవారం హైదరాబాద్‌లోని మూసాపేట నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు వలస కూలీలను రెండు బస్సుల్లో స్వస్థలాలకు పంపించారు. వారికి ఆహారంతో పాటు మాస్కులు, శానిటైజర్లను మనోజ్ స్వయంగా అందజేశారు. కార్మికులు తమ ఇళ్లకు చేరేంత వరకు మార్గమధ్యంలో వారికి అవసరమైన సౌకర్యాలను మనోజ్ టీమ్ కల్పిస్తున్నారు. ఇదే విధంగా గురువారం నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను హైదరాబాద్ నుంచి వారి ఊళ్లకు పంపించేందుకు మనోజ్ ఏర్పాట్లు చేస్తున్నారు.  బస్సుల్లో కార్మికులను తరలించేందుకు అనుమతులను కేంద్రం నుంచి తెచ్చుకున్నట్లు మనోజ్ వివరించారు. రానున్న రోజుల్లో ఈ సేవల్ని మరింత విస్తృతం చేస్తానని ఆయన అన్నారు.

Recommended For You