వరంగల్‌లో కలకలం.. పాడుబడ్డ బావిలో 9 మృతదేహాలు

వరంగల్‌ శివారులో 9 మృతదేహాలు బయటపడటం తీవ్రకలకలం రేపుతోంది. గొర్రెకుంటలోని ఓ గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఇప్పటి వరకు 9 మృతదేహాలు బయటపడ్డాయి. గురువారం నాలుగు మృతదేహాలు లభ్యం కాగా.. శుక్రవారం మరో ఐదు మృతదేహాలు గుర్తించారు. అయితే.. ఈ మృతదేహాలకు ఎలాంటి గాయాలు లేకపోవడంతో హత్య చేశారా లేక ఆత్మహత్యాలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గురువారం బయటపడ్డ మృత దేహాలు ఎండీ మక్సూద్‌, ఆయన భార్య నిషా, కుమార్తె బుస్ర , బుస్ర కుమారుడుగా గుర్తించారు. శుక్రవారం లభ్యమైన ఐదు మృతదేహాలు షాబాద్‌, సోహైల్‌, బిహార్‌కు చెందిన కార్మికులు శ్యామ్‌, శ్రీరామ్‌తో పాటు వరంగల్‌కు చెందిన షకీల్ గా గుర్తించారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని వరంగల్‌ సీపీ రవీందర్‌, మేయర్‌ జి.ప్రకాశరావు పరిశీలించారు.

ఎండీ మక్సూద్‌.. 20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ నుంచి బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వలస వచ్చాడు. గత డిసెంబరు నుంచి గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా.. గత నెలన్నర నుంచి గోడౌన్‌లో భార్య, ఇద్దరు కుమారులతో ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్ర కూడా తన మూడేళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ కుటుంబంతోపాటు బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాం కూడా అదే ఆవరణలోని మరో గదిలో ఉంటున్నారు. ఎప్పటిలాగా.. యజమాని సంతోష్‌ గురువారం మధ్యాహ్నం గోడౌన్‌కు వచ్చే సరికి కూలీలెవరూ కనిపించలేదు. వీరి కోసం వెతకగా.. చివరికి పాడుబడ్డ బావిలో నాలుగు మృతదేహాలు కనిపించాయి. శుక్రవారం కూడా ఐదు మృతదేహాలు లభ్యం కావడంతో.. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Recommended For You