సినిమా షూటింగ్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి

సినిమా షూటింగ్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి

తెలంగాణలో సినిమా షూటింగ్స్‌కు, నిర్మాణానంతర కార్యక్రమాలకు కేసీఆర్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్‌ తదితరులు సీఎంను కలిశారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం చేపట్టిన సహాయక చర్యలను వివరించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

సినీ ప్రముఖల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు సీఎం కేసీఆర్. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షల మంది జీవిస్తున్నారని, ప్రొడక్షన్‌ వర్క్‌, షూటింగ్‌లు, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకోవాలన్నారు. జూన్‌లో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. చివరిగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ ప్రముఖులను కోరారు సీఎం కేసీఆర్‌. ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని తెలిపారు. సినిమా షూటింగ్‌లపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌కు సినీహీరో చిరంజీవి ట్విటర్‌ వేదిక కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story