దేశంలో కరోనాతో శుక్రవారం ఒక్కరోజే 142 మంది మృతి

దేశంలో కరోనాతో శుక్రవారం ఒక్కరోజే 142 మంది మృతి

దేశంలో కరోనా కేసులు అదుపులోకి రాలేదు. వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ దాని తీవ్రత పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజు సుమారు 6న్నర వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య లక్ష పాతిక వేలకు చేరువైంది. మరోవైపు.. దేశంలో ఒక్కరోజే 142 మంది చనిపోయారు. దీంతో.. మొత్తం మృతుల సంఖ్య 3 వేల 726కి చేరింది. మరోవైపు.. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య.. కొత్త కేసుల్లో సగం కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రాలవారీగా చూస్తే.. మహారాష్ట్రలో 2 వేల 940 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో 63 మంది చనిపోయారు. తమిళనాడులోను వైరస్‌ ఉధృతికి అడ్డుకట్ట పడలేదు. ఆ రాష్ట్రంలో 786 కొత్త కేసులు రికార్డయ్యాయి. ఢిల్లీలో 660 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 363, రాజస్తాన్‌లో 262, ఉత్తరప్రదేశ్‌లో 220 కొత్త కేసులు రికార్డయ్యాయి. గుజరాత్‌లో 29 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో 62 కొత్త కేసులు, 55 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో.. ఏపీలో మొత్తం కేసులు 2 వేల 667కు చేరాయి. ఇటు తెలంగాణలో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య 17 వందల 61కి చేరింది.

దేశవ్యాప్తంగా ఈవారం పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 18వ తేదీ ఆదివారం రోజు 4 వేల 628 కేసులు నమోదయ్యాయి. 19న కొత్త బాధితులు 6వేల మార్క్‌ దాటారు. 20వ తేదీన కాస్త తగ్గి.. 5 వేల 760 కేసులుగా రికార్డయ్యాయి. 21వ తేదీన మళ్లీ 6వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 22న ఈసంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం 6 వేల 570 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story