డాక్టర్ సుధాకర్ కేసులో పోలీసులు, డాక్టర్ల తీరుపై పలు అనుమానాలు

డాక్టర్ సుధాకర్ కేసులో పోలీసులు, డాక్టర్లు తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుధాకర్ స్టేట్ మెంట్‌కి.. ప్రభుత్వ వివరణకు చాలా వ్యత్యాసాలు ఉండటంతో నిజానిజాలను తేల్చే బాధ్యతను సీబీఐకి అప్పగించింది కోర్టు. ఈ నెల 16న అసలేం జరిగింది? డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు విపరీతంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది? సుధాకర్ కుటుంబం ఆరోపిస్తున్నట్లు దురుద్దేశంతోనే అతన్ని పిచ్చోడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇలా డాక్టర్ సుధాకర్ కేసులో అన్ని అనుమానాలే. ఈ సందేహాలన్నింటిపై సీబీఐ ఎంక్వైరీ చేయనుంది. జడ్జికి ఇచ్చిన వాంగ్మూలంలో సుధాకర్ ఒంటిపై ఆరు చోట్ల గాయాలున్నట్లు చెబుతున్నారు. పైగా తన పట్ల పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరుపైనా ఆయన పలు ఆరోపణలు చేశారు. అయితే..ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో సుధాకర్ కు ఒక్క చోట మాత్రమే గాయమైనట్లు చెప్పింది. అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం..అతను ఎంత చెప్పినా మాట వినకపోవటం వల్లే పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం చెబుతున్న వివరణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం..ఈ కేసులో నిజా నిజాలు తేల్చే బాధ్యతను సీబీఐకి అప్పగించింది.

డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించటం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. సీబీఐ విచారణలోనైనా తన బిడ్డకు న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు సుధాకర్ తల్లి. ఈ నెల 16న సుధాకర్ ను అరెస్ట్ చేసిన తర్వాత కనీస పరిశీలన కూడా చేయకుండా కేవలం కొద్ది గంటల్లోనే అతని మానసిక స్థితి సరిగ్గా లేదని డాక్టర్లు నిర్ధారించటం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా 48 గంటలు పరిశీలించాక ఒక వ్యక్తి మానసిక స్థితిపై వైద్యులు అంచనాకు వస్తుంటారు. కానీ, డాక్టర్ సుధాకర్ విషయంలో మాత్రం కేవలం గంటల్లోనే అతని మానసిక స్థితి సరిగ్గా లేదంటూ డాక్టర్లు ఎలా చెబుతున్నారంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీబీఐ ఎంక్వైరీలో ఈ విషయంపై కూడా ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Recommended For You