కూతురంటే నీలా ఉండాలి.. జ్యోతిని మెచ్చిన 'ఇవాంక'

కూతురంటే నీలా ఉండాలి.. జ్యోతిని మెచ్చిన ఇవాంక

లాక్డౌన్ వేళ వలస కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. బ్రతుకుదెరువు కోసం ఊరు వదిలి వెళ్లిన వలస కూలీలు తిరుగు ప్రయాణమయ్యారు. పుట్టి పెరిగిన ఊరులో పడి ఉంటే కలో గంజో తాగి బతకొచ్చని కాళ్లరిగేలా వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. తమకున్న వాహనాల్లో మరికొందరు బయలుదేరారు. బీహార్ బాలిక జ్యోతికుమారి కూడా అలానే కన్న తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించింది.

ఈ విషయం అమెరికా అధ్యక్షుని కూతురు ఇవాంక కంట పడింది. ఆమె జ్యోతిని ప్రశంసించకుండా ఉండలేకపోయింది. కూతురికి తండ్రి పట్ల ఎంత ప్రేమ. ఎంతో ఓర్పు ఉన్న జ్యోతి తండ్రి ప్రేమకు పాత్రురాలు అని ప్రశంసించారు. జ్యోతి సాహసాన్ని దేశ ప్రజలతో పాటు భారత సైక్లింగ్ ఫెడరేషన్ కూడా గుర్తించిందని ఇవాంక ట్వీట్ చేశారు.

జ్యోతి స్టోరీ.. బిహార్‌కు చెందిన మోహన్ పాశ్వాన్ గురుగ్రామ్‌లో ఆటో నడిపి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. లాక్డౌన్‌‌కు ముందే అతడు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో తండ్రిని చూడ్డానికి వచ్చిన జ్యోతి లాక్డౌన్‌తో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మోహన్ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇక ఇక్కడ ఉండి ఉపయోగం లేదని భావించింది జ్యోతి.. ఉన్న కొద్దిపాటి డబ్బుతో సైకిల్ కొనుక్కుని దానిపై తండ్రిని ఎక్కించుకుని సొంతూరు దార్‌భంగా వెళ్లాలని నిర్ణయించుకుంది.

సైకిల్ తీసుకుని తండ్రిని వెనకాల కూర్చోబెట్టుకుని 1200 కి.మీ ప్రయాణం సాగించింది. ప్రయాణంలోని అలసటను తండ్రికి కనబడనివ్వలేదు. అలా 7 రోజుల పాటు సైకిల్ తొక్కుతూ మధ్యలో విరామం తీసుకుంటూ మొత్తానికి సొంతూరు చేరుకుంది. ఈ వార్త తెలుసుకున్న భారత సైక్లింగ్ సమాఖ్య జ్యోతిని ట్రయల్స్‌కు ఆహ్వానించింది. వచ్చే నెల దిల్లీలో నిర్వహించే ట్రయల్స్‌లో ఆమె అర్హత సాధిస్తే జాతీయ సైక్లింగ్ అకాడమీలో ఉచితంగా శిక్షణ అందిస్తామని సమాఖ్య తెలిపింది. జ్యోతికి మంచి భవిష్యత్ ఉండాలని తండ్రితో పాటు గ్రామ ప్రజలూ ఆశిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story