శ్రీవారి ఆస్తులు అమ్మకానికి సిద్ధమైన టీటీడీ

శ్రీవారి ప్రసాదం అమ్మకాలపై వివాదస్పద నిర్ణయం తీసుకున్న టీటీడీ.. ఇప్పుడు స్వామివారి ఆస్తుల విషయంలోనూ అదే వ్యాపార ధోరణితో ఆలోచిస్తోంది. శ్రీవారి ఆస్తుల విక్రయానికి ప్రయత్నాలు ప్రారంభించింది. తొలుత తమిళనాడులో టీటీడీకి చెందిన 23 ఆస్తులను అమ్మేందుకు రంగం సిద్ధం చేసింది. ఆస్తుల విక్రయాన్ని చక్కబెట్టేందుకు కమిటీలను ఏర్పాటు చేసి.. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం వేలం వేసేందుకు పచ్చజెండా ఊపేసింది. స్థిరాస్తులను అమ్మటం ద్వారా దాదాపు 100 కోట్లు సమకూరే అవకాశాలు ఉన్నాయి.

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు, ఆథ్యాత్మిక ధోరణిలో సాగాల్సిన టీటీడీ పాలక మండలి నిర్ణయాలు.. ఇటీవలి కాలంలో పూర్తిగా వ్యాపార ధోరణిలో సాగుతున్నాయి. భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని మిఠాయి కొట్టులో స్వీట్లలా డెలివరీ చేసేందుకు రెడీ అయ్యింది. ఇక ఇప్పుడు స్వామి వారి ఆస్తులను కూడా అమ్మేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. పైసా రాబడి లేకున్నా.. కేవలం స్వామి వారి సొమ్ముతోనే కొన్నేళ్ల పాటు భక్తులకు ఉచితంగా తీర్ధప్రసాదాలు, అన్నదానాలు చేయవచ్చు. అలాంటిది శ్రీవారి పవిత్రతను మరింత పెంచే లక్ష్యంతో పని చేయాల్సిన టీటీడీ.. స్వామివారి ప్రసాదాన్ని, ఆస్తులను వ్యాపార ధోరణిలో ఆలోచించటం విమర్శలకు తావిచ్చేలా చేస్తోంది. తిరుమలేశుడి ఆస్తుల అమ్మాలన్న టీటీడీ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమలేశుడి భక్తులు.. ఆయనకు అనేక రూపాల్లో విరాళాలు ఇస్తుంటారు. కొందరు భక్తులు స్థిరాస్తులు స్వామివారి పేరున కానుకలుగా సమర్పించుకుంటారు. ఇలా దాతలు ఇచ్చిన భూములను అమ్మాలని టీటీడీ ప్రయత్నిస్తుండటం వివాదస్పదం అవుతోంది. స్వామివారి స్తిరాస్తులు ధర్మ ప్రచారానికి, అథ్యాత్మిక చింతన పెంచటానికి వినియోగించాలని దాతలు భావిస్తుంటారు. సంతానం లేని వారు కూడా తమ తదనంతరం తమ ఆస్తి స్వామివారికి చెందాలని ఎంతో భక్తితో వీలునామా చేస్తారు. అలాంటి దాతలంతా ఆ ఆస్తులు ఎప్పటికీ స్వామి పేరు మీదే ఉండాలని కోరుకుంటారు. భక్తులు మనోభావాలను దెబ్బతీసేలా శ్రీవారి భూములను అమ్మాలన్న నిర్ణయంపై హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

శ్రీవారి భూములను అమ్మాలన్న TTD నిర్ణయంతో లాభపడేది ఎవరు? దేవుడా? ఆయన పేరు మీద టీటీడీ బంధుగణమా? శ్రీవారి ఆస్తులను అమ్మాలన్న ప్రయత్నాలు ఇలాంటి అనుమానాలకే తావిస్తున్నాయి. TTD ఇష్టారీతిని తీసుకుంటున్న నిర్ణయాలతో విలువైన స్వామివారి ఆస్తులను తమ బంధువర్గానికి కట్టబెట్టాలనే కుట్ర జరుగుతోందన్నది విపక్షాల ఆరోపణ. హిందూ ధార్మికతకు, స్వామి భక్తులకు ఉపయోగపడాల్సిన భూములను అమ్మేస్తే చూస్తూ ఊరుకోబోమని.. హిందూ ధార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఆస్తుల అమ్మకంపై TTD వెనక్కి తగ్గకపోతే ఆందోళన చేసేందుకు ప్రజాసంఘాలు సిద్ధమవుతున్నాయి.

Recommended For You