హైకోర్టు ఆదేశాలు పక్కన పెట్టి.. రంగుల రాజకీయం కొనసాగిస్తున్న వైసీపీ

హైకోర్టు ఆదేశాలు పక్కన పెట్టి.. రంగుల రాజకీయం కొనసాగిస్తున్న వైసీపీ

గుడి, బడి, పంచాయితీ కార్యాలయం, రైతు భరోసా కేంద్రం.. ఇలా దేన్నీ వదలడం లేదు వైసీపీ ప్రభుత్వం. ప్రతి కార్యాలయాన్ని పార్టీ రంగులతో నింపేస్తున్నారు. కార్యాలయాలకు పార్టీ రంగులు వెయ్యొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రంగులు వేయడం మానడం లేదు. చిత్తూరు జిల్లాలో ఏ కార్యాలయాన్ని చూసినా వైసీపీ రంగులే దర్శనమిస్తున్నాయి. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న చెట్లకు కూడా వైసీపీ జెండా రంగులు వేసి స్వామి భక్తిని చాటుకుంటున్నారు.

చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు దర్శనమిస్తున్నాయి. విద్యుత్‌ సరఫరా చేసే రెస్కో కార్యాలయానికి పార్టీ రంగులు వేయడం వివాదాస్పదమవుతోంది. అయితే, హైకోర్టు మొట్టికాయలు వేయడంతో మరో రంగు వేసి చేతులు దులుపుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. హైకోర్టు భయంతో మూడు రంగులకు మరో రంగును జత చేశారు.

ఇక ఇదే కుప్పం నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రానికి కూడా వైసీపీ జెండా రంగులు వేశారు. వ్యవసాయాధికారి కార్యాలయం వున్న అంతస్తుకు ఒక రంగు, మొదటి అంతస్తులో వున్న రైతు భరోసా కేంద్రానికి మరో రంగు వేశారు. జిల్లాల్లోని మరికొన్ని చోట్ల కూడా రైతు భరోసా కేంద్రాలకు ఇలాగే రంగులద్దుతున్నారు. వైసీపీ నేతల రంగుల రాజకీయాన్ని చూసి జిల్లా ప్రజలు విస్మయం చెందుతున్నారు. ఇవెక్కడి రంగులంటూ మండిపడుతున్నారు.

మరోవైపు విశాఖ నగరం ఎండాడలో ప్రభుత్వం కొన్ని రోజల క్రితం ప్రారుంభించిన దిశ పోలీస్ స్టేషన్‌కు సైతం వైసీపీ రంగులు దర్శనమిస్తున్నాయి. పోలీస్‌ స్టేషన్ ఉమెన్ లోగోతో పాటు.. మహిళల చిత్రాలన్నీ కూడా వైసీపీ పార్టీ రంగుల్లోనే వున్నాయి. ఈ రంగుల వ్యవహారాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story