సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ జరగనుంది. కరోనా, లాక్‌డౌన్, వర్షాకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ వేడుకలపై చర్చించనున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలుపైనా ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో సగం షాపులు ఒక రోజు, సగం షాపులు మరుసటి రోజు తెరుస్తున్నారు. మరి కొంత కాలం ఇలాగే కొనసాగించాలా.. ఏమైనా మార్పులు చేయాలా అనే విషయంపై చర్చించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్ గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఈ నెల 31 తరువాత ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై సమాలోచనలు చేయనున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసీ సర్వీసుల పునరుద్ధరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అటు వర్షాకాలం వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై కూడా సీఎం చర్చిస్తారు. గ్రామాల్లో ఎరువుల లభ్యత ఉందా లేదా.. విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేవా అనే విషయాలపై సమీక్ష జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా జరపాలనే విషయం కూడా అధికారులతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com