కేంద్రం, ఆర్బీఐలకు సుప్రీం కోర్టు నోటీసులు

కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడంతో.. తీసుకున్న రుణాలకు నెలవారీ చెల్లింపులపై కేంద్రం మూడు నెలల పాటు మారటోరియం విధించిన విషయం తెలిసిందే. అయితే, ఇది సామాన్య, మధ్య తరగతి వారికి తీవ్రనష్టాన్ని మిగుల్చుతోందని సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. లాక్ డౌన్ సమయంలో అన్ని కార్యకలాపాలు ఆగిపోవడంతో కేంద్రం మూడు నెలలు ఈఎంఐలపై మారటోరియం విధించిందని.. అయితే, కరోనా ప్రభావం మరో మూడు నెలలు పొడిగించిందని పిటిషర్ తరపు న్యాయవాది సుప్రీం ధర్మాసనం ముందు ఉంచారు. కానీ, ఈ ఆరునెలల వాయిదాలు చెల్లింపు జరగకపోవడంతో వాటిపై వడ్డీల వేస్తున్నారని.. ఇది సామాన్య, మధ్య తరగతి ప్రజల వెన్ను విరవడంతో సమానమని అన్నారు. అన్ని రకాలుగా.. నష్టపోయిన ప్రజలకు మళ్లీ ఇలా చక్రవడ్డీలు వేసి వారిని ఇబ్బందుకు గురి చేయడం దారుణమని అన్నారు. దీంతో సుప్రీం కోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రం, ఆర్బీఐలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ కొనసాగుతుందని కోర్టు పేర్కొంది.

Recommended For You