ఏపీ ప్రభుత్వ తీరుపై జీవీఎల్ మండిపాటు

ఏపీ ప్రభుత్వ తీరుపై జీవీఎల్ మండిపాటు

ఏపీలో వైసీపీ ఏడాది పాలనపై బీజేపీ కన్నెర్రజేసింది. జగన్ ప్రభుత్వం సొమ్మొకడిది సోకొకడిది అన్న రీతిలో వ్యవహరిస్తోందని మండిపడింది. సీఎం జగన్ ఏడాదిలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. 2019లో ప్రజలు నమ్మి జగన్‌కు అవకాశం ఇస్తే.. ఆయన తన విశ్వరూపం చూపిస్తున్నారని అన్నారు. అనుభవ రాహిత్యం, అసమర్ధత, అవినీతి, అవగాహన లేకపోవడం, ఆత్రం, పోలీసు రాజ్యం, రివర్స్ టెండరింగ్.. ఇదే జగన్ ఏడాది పాలన అని ఎద్దేవా చేశారు. జగన్ వచ్చాక మూడు రాజధానుల పేరుతో కొత్త రాజకీయం మొదలు పెట్టారని అన్నారు. రాయలసీమ లో పెండింగ్ లో ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పరంగా లిక్కర్ పాలసీ అమలు చేస్తామన్న ప్రభుత్వం.. కొన్ని బ్రాండ్లకు మాత్రమే అనుమతిచ్చారన్నారు కన్నా లక్ష్మినారాయణ. రాష్ట్రంలో పేదవాడి రక్తం పిండుతున్నారని.. 50 లక్షల మంది కార్మికులు వలసపోయారని అన్నారు. ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదు అనడానికి హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన 65 తీర్పులే నిదర్శనమని అన్నారు కన్నా లక్ష్మినారాయణ. హైకోర్టుకు కూడా కులాలు, మతాలను అంటగట్టేలా ఎమ్మెల్యేలు, నాయకులు బరితెగించారని మండిపడ్డారు. ఏడాది కాలంలో తన అసమర్థతను చాటుకున్న జగన్మోహన్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందన్నారు. నవరత్నాల పేరుతో ప్రజల్ని జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు కన్నా లక్ష్మినారాయణ. ప్రజలు 151 సీట్లిస్తే.. ధైర్యం గా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదని మండిపడ్డారు. జగన్ ఓ విఫలమైన సీఎం అని.. ఏడాది పాలనంతా తాను చెప్పిన ఎనిమిది క్యాప్షన్స్ ప్రకారమే నడిచిందని అన్నారు.

అటు ఏపీ ప్రభుత్వ తీరుపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను.. ఏపీ ప్రభుత్వం పేరు మార్చి నిధులను మళ్లిస్తోందని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధుల విషయంలో ఏపీకి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఆయుష్మాన్‌ భారత్ పథకంలో 10 శాతం నిధులు ఏపీకే ఇస్తున్నామని తెలిపారు. అయినా ఆ పేరుతో పథకం నడవడం లేదన్నారు. ఆరోగ్యశ్రీకి కేంద్రం నిధులు ఇస్తున్న నేపథ్యంలో.. ఆయుష్మాన్‌ భారత్ పేరుతోనే పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story