ఏపీ ఎస్ఈసీ విషయంలో.. సుప్రీంకోర్టు తలుపు తట్టిన మాజీ మంత్రి

ఏపీ ఎస్ఈసీ విషయంలో.. సుప్రీంకోర్టు తలుపు తట్టిన మాజీ మంత్రి

ఏపీ SEC వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఇప్పటికే కొట్టేసిన హైకోర్టు.. మళ్లీ రమేష్‌ కుమార్‌నే ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఆదేశించింది. దీనిపై ఇప్పటికే సుప్రీం కోర్టు తలుపుతట్టిన ప్రభుత్వం.. తాజాగా హైకోర్టులో వేసిన స్టే పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. అటు ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ వివాదంలో ట్విస్టుల మీద ట్విస్టులు. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేసులో స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినందున హైకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. హైకోర్టు తీర్పు అమలుపై స్టే కోరుతూ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు.

నిమ్మగడ్డ వ్యవహారంపై బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం స్పెషల్‌ లీవ్ పిటిషన్‌ దాఖలు చేయడంతో కేవియట్ వేసినట్టు తెలిపారు. హైకమాండ్‌ అనుమతితోనే సుప్రీంలో పిటిషన్‌ వేశానని చెప్పారు. అంతకుముందు నిమ్మగడ్డ తొలగింపుపై బీజేపీ తరపున హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి విజయం సాధించారు కామినేని. ఇక SEC వివాదంపై ఇప్పటికే సుప్రీంలో మరో నాలుగు కేవియట్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి..కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ నేత మస్తాన్‌వలీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్, వర్లరామయ్య, జితేంద్రబాబు కూడా ఇప్పటికే కేవియట్లు దాఖలు చేశారు.

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్‌ పిటిషన్‌ తప్పులు తడకగా మారింది. వాది, ప్రతివాదిగా ఏపీ ప్రభుత్వాన్నే చేర్చారు లాయర్లు. పిటిషన్‌లోతప్పులపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు. తప్పులు సరిచేసి మళ్లీ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. SEC పదవీకాలాన్ని కుదిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను సమర్ధిస్తూ.. మూడు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు ఏపీ ప్రభుత్వం దాఖలు చేయబోతోంది.

Tags

Read MoreRead Less
Next Story