ఒకేరోజు నాలుగు హత్యలతో ఉలిక్కిపడిన హైదరాబాద్

ఒకేరోజు నాలుగు హత్యలతో ఉలిక్కిపడిన హైదరాబాద్

కర్ఫ్యూ అమల్లో వున్నా.. హైదరాబాద్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. వేర్వేరు ఘటనల్లో ఒకేరోజు నాలుగు హత్యలకు పాల్పడ్డారు. గోల్కొండ, లంగర్‌హజ్‌ పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం రాత్రి నాలుగు హత్యలు చోటుచేసుకున్నాయి. గోల్కొండలో నివసిస్తున్న రౌడీషీటర్ చాందీ షేక్‌ మహమ్మద్, అతిని స్నేహితుడు ఫయాజుద్దీన్‌ను శుక్రవారం రాత్రి పదిన్నర సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు.

బైక్‌పై వెళ్తున్న చాందీ షేక్, ఫయాజుద్దీన్‌లను మొదట క్వాలిస్ వాహనంతో ఢీకొట్టారు. ఇద్దరూ రోడ్డపై కిందపడటంతో క్వాలిస్ నుంచి దిగిన ముగ్గురు రౌడీషీటర్లు.. కత్తులతో అతి కిరాతంగా దాడిచేశారు. ఈ ఘటనలో షేక్‌ మహమ్మద్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్ర గాయాలైన ఫయాజుద్దీన్ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న లంగర్‌హౌజ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.. హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. పరారీలో వున్న ముగ్గురు నిందితుల కోసం వెస్ట్ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలిస్తున్నారు.

ఇక మరో ఘటనలో స్నేహితుడిని బండరాయితో మోది చంపాడో ప్రబుద్ధుడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లికి చెందిన రాహుల్ అగర్వాల్, అజర్ స్నేహితులు. అయితే, వీరిద్దరి మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లాపూర్ సమీపంలోని శ్మశానవాటిక సమీపంలో రాహుల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడే పడివున్న యాక్టివాలోని పుస్తకాల ఆధారంగా మృతుడు రాహుల్‌గా గుర్తించారు. అజర్ ఈ హత్యకు చేశాడని తమ విచారణలో తేలిందని.. నిందితుడు దొరికితే హత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

ఇక ఆస్తి వివాదాలు ఓ యువకుడిని పొట్టనబెట్టున్నాయి. పాతబస్తీ రెయిన్ బజార్‌ పీఎస్‌ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చున్నేకిబట్టి చందానగర్‌కు చెందిన మహమ్మద్‌ ఇమ్రాన్ ఖాన్‌ అనే విద్యార్థికి ఆస్తి వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జాఫర్‌ రోడ్డు మార్గంలో నడుస్తూ వెళ్తున్న ఇమ్రాన్‌ను ఆగంతకులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఇమ్రాన్ తల్లి హబీబున్నిసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలారఫ్ చిడి హత్యాప్రయత్నం జరిగింది. మహమ్మద్ షారూఖ్ అనే యువకుడిపై ఆర్బాజ్ అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని.. గాయపడ్డ షారూఖ్‌ను ఆసుపత్రికి తరలించారు. తన సోదరిని షారూఖ్ అనే వ్యక్తి కామెంట్ చేశాడన్న కోపంతో ఆర్బాజ్ అనే నిందితుడు కత్తితో దాడిచేసినట్టు తెలుస్తోంది. నిందితుడు ఆర్బాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story