అది మరో జగన్మాయా పథకం : చంద్రబాబు

అది మరో జగన్మాయా పథకం : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు.. ఏడాదిగా రాష్ట్రంలో ఉన్మాదుల పాలన చూస్తున్నామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. కరుడుగట్టిన నేరస్థుల పాలన చూస్తున్నామన్నారు. దేశమంతా అంబేద్కర్‌ రాజ్యాంగం అమలు చేస్తుంటే ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. పులివెందుల పంచాయతీలు చేస్తున్నారని, తప్పుడు కేసులతో ప్రజలను వేధిస్తున్నారని చంద్రబాబు ఫైరయ్యారు.. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా పాటించడం లేదన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాశారంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.. రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారని, రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని జగన్‌ నిలబెట్టుకోలేదని అన్నారు.. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని నమ్మించి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ కార్యకర్తల ఆర్థిక మూలాలను దెబ్బతీశారని చంద్రబాబు మండిపడ్డారు.. టీడీపీతోపాటు ఇతర ప్రతిపక్ష నేతలపైనా అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.. దశాబ్దాలుగా వైద్య సేవల్లో ఉన్న దళిత డాక్టర్లకు వేధింపులు హేయమైన చర్యగా చంద్రబాబు అభివర్ణించారు.. డాక్టర్‌ సుధాకర్‌ను మానసిక వైద్యశాలలో చేర్చారని, డాక్టర్‌ అనితారాణి మానసిక స్థితిపై దుష్ప్రచారం చేశారని చంద్రబాబు తీవ్రంగా ఆక్షేపించారు.. పిచ్చి డాక్టర్లకు కాదని, వైసీపీ నాయకులేనని అన్నారు. మానసిక రోగం ఉన్నది వైసీపీ నాయకులకేనన్నారు.. అందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు.

చేదుడు పేరుతో వైసీపీ కనికట్టు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఇది మరో జగన్మాయా పథకమన్నారు. అబద్ధమే వైసీపీ ఆయుధమని, వైసీపీ చెప్పేది అబద్ధమని, చేసేది శూన్యమని అన్నారు.. గతంలో అందరికీ లబ్ధి చేకూరుస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చారని చంద్రబాబు మండిపడ్డారు. షాపులు ఉన్నవాళ్లకే చేదోడు పథకమంటూ మాట మార్చారని అన్నారు. చేదోడు పేరుతో భారీగా కోతలు పెట్టారని విమర్శించారు. సీఎం అయిన తర్వాత జగన్‌ అసత్యాలతో నయవంచన పాలన చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story