ఏపీ రాజ్యసభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

ఏపీ రాజ్యసభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

ఏపీ రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్‌ మొదలైంది. మరో గంటలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 173 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు 151 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఓటింగ్‌కు హాజరుకాలేకపోయారు. అరెస్టై రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నాయుడు, సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న అనగాని సత్యప్రసాద్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఈ ముగ్గురు ఎవరికి ఓటు వేశారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఓటింగ్ జరగ్గా ఐదుగురు బరిలో నిలిచారు. వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని బరిలో ఉండగా.. టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీలో ఉన్నారు. అసెంబ్లీలో పార్టీల బలాబలాలను బట్టి మొదటి ప్రాధాన్య ఓటు లెక్కింపుతోనే అంటే తొలి రౌండ్‌లోనే గెలుపొందిన అభ్యర్దులెవరో తేలిపోనుంది.

దేశ వ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 36 స్థానాలకు అభ్యర్థులు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. మిగిలిన 8 రాష్ట్రాల్లోని 19 రాజ్యసభ స్థానాలకు ఈ రోజు ఎన్నికలు నిర్వహించారు. మార్చి 26నే ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేశారు.

Tags

Read MoreRead Less
Next Story