రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరి మారిందా?

రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరి మారిందా?

రాజధాని అమరావతి విషయంలో ఇప్పుడేం జరుగుతోంది. తరలింపు ఇప్పట్లో ఉండకపోవచ్చంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటన చేయడం.. మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని ప్రాంతంలో రెండు రోజులుగా పర్యటించడం వెనుక లెక్కేంటి..? ఇప్పుడీ అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. మంత్రి బొత్స శనివారం రాయపూడిలో పర్యటించారు. CRDA కమిషనర్‌తో కలిసి గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు నిర్మాణాలు పరిశీలించారు. దీనికి కొనసాగింపుగానే సోమవారం కూడా అధికారులతో కలిసి మళ్లీ రాయపూడి వెళ్లారు. ఆ చుట్టుపక్కల నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోయిన అఖిలభారత సర్వీసు అధికారుల అపార్ట్‌మెంట్లు, NGOల క్వార్టర్లు, HODల కోసం నిర్మిస్తున్న టవర్లు పరిశీలించారు. అలాగే న్యాయమూర్తుల నివాస సమూదాయాల నిర్మాణ పనులు ఎంత వరకూ జరిగాయో కూడా ఆరా తీశారు. 3 రాజధానులు- పాలనా వికేంద్రీకరణ బిల్లు రెండోసారి కూడా అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో.. ఉన్నట్టుండి బొత్స అమరావతి ప్రాంతంలో ఎందుకు పర్యటిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు ఆరా తీస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.

అటు, మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రాజధానిపై మాట్లాడారు. కరోనా ప్రభావం తగ్గేవరకూ తరలింపు ఉండబోదని విస్పష్టంగా ప్రకటించారు. పెద్దిరెడ్డి స్థాయిలో వ్యక్తి ఒక ప్రకటన చేశారంటే దానికి CM ఆమోదం ఉన్నట్టే భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం కూడా మరోమారు మంత్రి పెద్దిరెడ్డి తరలింపు ఇప్పట్లో ఉండబోదని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు, బొత్స పర్యటనలు కలిపి చూస్తే అమరావతి విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

కేబినెట్ మంత్రుల్లో మొదటగా రాజధాని మార్పు విషయంపై మాట్లాడింది బొత్స సత్యనారాయణే. GN రావు కమిటీ ఏర్పాటు వంటి అన్నింటిపైనా కూడా ఆయనే పలు సందర్భాల్లో వివరణ ఇచ్చారు. రాజధాని 3 ప్రాంతాల్లో కాకపోతే 33 చోట్ల పెట్టుకుంటామంటూ అప్పట్లోనే పెద్దిరెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రాజధానులపై నిరసనలు వెల్లువెత్తినా, అమరావతిలో దాదాపు 190 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా.. వాటిని పట్టించుకోకుండా ముందుకే వెళ్లింది ప్రభుత్వం. వికేంద్రీకరణ బిల్లు, CRDA రద్దు బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాయా లేదా అనే విషయంపై వివాదం నడుస్తున్న టైమ్‌లోనే.. మరోమారు 2 బిల్లులను శాసనసభలో పెట్టి ఆమోదింపచేసుకున్నారు. మండలి వాటిని ఆమోదించినా, ఆమోదించకపోయినా సరే నెల రోజుల్లో అవి చట్టరూపం దాల్చుతాయి. ఈ పరిస్థితుల్లో రాజధాని తరలింపు వాయిదా వేసినట్టు మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంత్రి బొత్స రాజధాని ప్రాంతంలో పర్యటించారన్నా, మంత్రి పెద్దిరెడ్డి రాజధాని తరలింపు వాయిదా పడిందని చెప్పినా అన్నీ CMకు తెలిసే జరుగుతాయి. అంటే.. ఉన్నట్టుండి ప్రభుత్వ నిర్ణయం మారడానికి కారణాలేంటి? కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రాజధాని తరలింపు వాయిదా పడిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? కరోనా ప్రభావం వల్లే కొద్ది నెలలు ఆగినట్టా..? లేక అమరావతి విషయంలో కొన్నాళ్లు యధాతధ స్థితి కొనసాగుతుందా? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. అటు అమరావతి జేఏసీతోపాటు విపక్ష పార్టీలు కూడా తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.

రాజధాని విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటనే విషయంపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చిన సమయంలోనే.. కరకట్ట రోడ్డు విస్తరణకు ప్రయత్నాలు జరుగుతుండడం కూడా ఆసక్తికరంగా మారింది. కరకట్టపై ప్రస్తుతం ఉన్న రహదారిని 2 వరుసల రోడ్డుగా విస్తరించేందుకు CRDA ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దాదాపు 14 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డు వెడల్పు చేయడం కీలక పరిణామమే. ఇప్పటికే CRDA పరిధిలో సీడ్ యాక్సెడ్ రోడ్ల నిర్మాణం కొంత వరకూ పూర్తయ్యింది. ప్రకాశం బ్యారేజీ నుంచి రాజధానికి వచ్చే కరకట్ట దారిని కూడా విస్తరిస్తే రాకపోకలకు వీలుగా ఉంటుంది. గతంలోనే CRDA ఈ రోడ్డు విస్తరణకు 395 కోట్ల అంచనాతో టెండర్లు కూడా పిలిచింది. అప్పుడు ఆగిన పనులు ఇప్పుడు మళ్లీ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఐతే.. గతంలో అనుకున్నట్టు 25 మీటర్ల వెడల్పుకు విస్తరిస్తారా.. కొంత కుదిస్తారా అనేది త్వరలో తెలియనుంది. అలాగే రోడ్ల విస్తరణ కావచ్చు.. ఇతర నిర్మాణాలు పునఃప్రారంభించడం కావచ్చు.. ఈ పనులకు నిధులు ఎలా అనే దానిపై కూడా CRDA అధికారులతో బొత్స చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ అమరావతిపై సర్కారు వ్యూహం ఏంటనే విషయంపై కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story